పీడీ అకౌంట్లపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్ను కోరామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. గురువారం పలువురు నేతలతో కలిసి గవర్నర్ నరసింహన్ను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... పీడీ అకౌంట్లపై ఇప్పటికే నివేదిక తెప్పించుకున్నానని గవర్నర్ చెప్పారన్నారు. అదనంగా సమాచారం ఉంటే ఇవ్వాలని గవర్నర్ కోరారన్నారు. అలాగే ఏ రాష్ట్రంలోను లేని విధంగా ఏపీలో పీడీ అకౌంట్లను తెరిచారని, మొత్తం రూ. 53 వేల కోట్ల నిధులను దుర్వినియోగం చేశారన్నారు. పీడీ అకౌంట్లపై యనమల రామకృష్ణుడు సహా అందరూ అబద్ధాలు చెబుతున్నారని, పీడీ అకౌంట్లలో జరిగిన అవినీతిని కాగ్ తప్పు పట్టిందని, అవినీతి కోసమే అమరావతి బాండ్ల పేరుతో అప్పులు తెచ్చారని, ఎక్కువ అప్పులు తెచ్చి ఎక్కువ దోచుకోవాలని చూస్తున్నారని జీవీఎల్ అన్నారు.