విజయవాడ నుంచి ప్రవహించే బందర్ కాలువతో పాటు మూడు కాలువలను సుందరంగా ఆకర్షణీయంగా అభివృద్ధి చేసే ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సమీక్షించారు. ఇటు వైకుంఠపురం, చోడవరం నుంచి అటు అమరావతి వరకు ఉన్న విశాలమైన నదీ తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మొత్తం 27 కిలోమీటర్ల మేర ఉన్న ఈ తీరప్రాంతం "నీలి-హరిత సుందర ప్రాంతం" గా అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. ప్రకాశం బ్యారేజీ కి ఇరువైపులా కొండ, ఘాట్లు ఉన్న ప్రాంతాల్లో హరితవర్ణంగా మారాలి. 360 రోజులు ఈ కాలువల్లో నీటి ప్రవాహం ఉండే అవకాశం ఉంది కాబట్టి వీటిని మంచి పర్యాటక ఆకర్షణలుగా మార్చడానికి వెంటనే తగు చర్యలు చేపట్టాలని అయన అన్నారు. శుద్ధ, పరిశుభ్ర జలాలు ఈ కెనాళ్లలో ప్రవహించేలా చూడాలి. పర్యావరణ పరంగా అన్ని అనుమతులు తీసుకోవాలని అయన అన్నారు. విజయవాడ కనకదుర్గ గుడి కి చుట్టుపక్కల 25 ఎకరాలు అభివృద్ధికి ఇచ్చిన ప్రతిపాదనలకుడా అయన సమీక్షించారు. కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు, స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, షాపింగ్ కాంప్లెక్స్, పెద్ద పార్కింగ్ ప్రదేశం, సర్వీస్ అపార్టుమెంట్లు, పార్కులు నిర్మాణం జరగాలని అన్నారు. రైల్వే స్టేషన్ నుంచి నేరుగా దుర్గ గుడికి వెళ్లేలా మార్గాన్ని అభివృద్ధి చేసే ప్రతిపాదనను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్బంగా సీఆర్డీఏ ఉద్యోగుల తరఫున ఒక రోజు జీతం 5.57 లక్షల రూపాయలను కేరళ వరదబాధితులకు విరాళంగా ముఖ్యమంత్రి కి కమీషనర్ శ్రీధర్ అందజేసారు.