ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మరో అరుదైన ఘనత సాధించింది. గురువారం ఆర్ఐఎల్ మార్కెట్ కేపిటల్ విలువ తొలిసారి రూ. 8 లక్షల కోట్లకు చేరింది. మధ్యాహ్నం 1.40 గంటలకు షేర్ విలువ రూ.1,262.50 వద్ద ట్రేడ్ కాగానే.. స్టాక్ మార్కెట్లో రూ.8 లక్షల కోట్ల మార్కెట్ కేపిటల్ దాటిన తొలి భారత కంపెనీగా ఆర్ఐఎల్ రికార్డ్ నెలకొల్పింది. రెండో స్థానంలో ఉన్న టీసీఎస్ మార్కెట్ విలువ రూ. 7,77,870 కోట్లుగా ఉంది. గత జూలైలోనే ముకేశ్ కంపెనీ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్ల మార్క్ చేరుకుంది. ఏడాది కాలంలోనే రిలయన్స్ షేర్లు 60 శాతం పెరిగాయి. ఆర్ఐఎల్ మార్కెట్ విలువను 2025 నాటికి రెట్టింపు చేయడమే లక్ష్యమని కంపెనీ 41వ వార్షిక సమావేశం సందర్భంగా ముకేశ్ ప్రకటించారు.