ఛత్తీస్‌గఢ్‌లో మరి కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఓ యువ కలెక్టర్‌పై కన్నేసింది. రాయ్‌పూర్ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తోన్న ఓపీ చౌధురీ (37)తో బీజేపీ రెండు నెలలుగా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. సొంత జిల్లా రాయ్‌గఢ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించకపోయినప్పటికీ.. చౌధురీ పార్టీకి యూత్ ఐకాన్‌లా ఉపయోగపడతారని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
రాయ్‌గఢ్‌లో బయాంగ్‌కు చెందిన రైతు కుటుంబం నుంచి వచ్చిన చౌధురీ.. అఘారియా వర్గానికి రోల్‌మోడల్. ఆయన బీజేపీలో చేరితే.. ఆ వర్గం తమ వైపు మొగ్గుచూపుతుందని బీజేపీ భావిస్తోంది. 2005 బ్యాచ్‌కు చెందిన ఈ యువ ఐఏఎస్ అధికారి ఆషామాషీ వ్యక్తేం కాదు. 2011లో మావోల ప్రాబల్యమున్న దంతెవాడ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన ‘ఎడ్యుకేషన్ సిటీ’ ఏర్పాటు చేశారు. మావోల కారణంగా విద్యార్థులు చదువు దూరం కాకుండా చూడటానికి ఆయన తపించారు. నక్సల్స్ భయంతో దంతెవాడలో పని చేసేందుకు ప్రభుత్వ అధికారులు, టీచర్లు, వైద్యులు ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో.. ఆయన ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు కృషి చేశారు. నాణ్యమైన విద్య అందడంతో రెండేళ్లలోనే డ్రాపౌట్ల సంఖ్య 50 శాతం నుంచి 13 శాతానికి తగ్గింది