రాష్ట్ర రాజధాని ప్రాంతంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలను నియంత్రించడంతోపాటు, పార్కింగేతర ప్రాంతాల్లోనూ, దుకాణాల ముందు అడ్డుగోలుగా వాహనాలను నిలుపుదల చేయడం ద్వారా ఉత్పన్నం అయ్యే సమస్యలకు చెక్ పెట్టేందుకు నగరపాలక సంస్థ అధికారులు ప్రస్తుతం స్మార్టు పార్కింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానం కింద నగరంలోని 20 ప్రాంతాలను ఎంపిక చేయగా.. ప్రస్తుతం 3 ప్రాంతాల్లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ సౌకర్యం వాహన చోదకులను అందుబాటులోకి వచ్చింది.
స్మార్టు పార్కింగ్ ప్రక్రియను అమలు చేసేందుకు అధికారులు కొంతకాలంగా చేస్తున్న యత్నాలు నేడు ఫలించాయి. ఇందుకు సంబంధించిన టెండరును దక్కించుకున్న స్మార్టు పార్కింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నగరంలోని 20 ప్రాంతాల్లో ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఆ సంస్థ అవసరమైన సాంకేతిక విధానాన్ని, పరికరాలను, సిబ్బందిని సమకూర్చుకుంటుండగా, 30 మంది సిబ్బందిని ప్రస్తుతం విధుల్లోకి తీసుకోవడం ద్వారా ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు. ఈ విధానం చెన్నైలో అమలులో ఉండగా.. అధ్యయనం చేసిన అధికారులు ఇక్కడి ట్రాఫిక్ ఎడ్వయిజరీ కమిటీ ఆమోదంతో తాజాగా నగరంలో అందుబాటులోకి తెచ్చారు. వాహన చోదకులు స్మార్టుఫోన్ సాయంతో తమ వాహనాన్ని పార్కింగ్ చేసుకునేందుకు ఎక్కడి నుంచైనా ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకునే సౌకర్యం ఉంది. ఈ విధానంలో నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలు, వివిధ కూడళ్లు, వ్యాపార ప్రాంతాలు, వాణిజ్య సముదాయపు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు, వాహన పార్కింగ్ వెతలకు చెక్‌పెట్టే వీలుంది. మరోవైపు వాహనచోదకులకు తగిన పార్కింగ్ సౌకర్యాలు కల్పించడం ద్వారా వివాదాలను నియంత్రించడంతోపాటు, అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టాలని నిర్ణయించారు. స్మార్టు పార్కింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ రూ.2.25 కోట్లకు టెండర్లను దక్కించుకుంది.
ఈ విధానం దిల్లీ, ముంబయి, చెన్నై వంటి పెద్ద నగరాల్లో అమలులో ఉండగా, మన రాష్ట్రంలోని విజయవాడలో మొదటిసారిగా అమలులోకి తెచ్చారు. స్మార్టు పార్కింగ్‌కు అవసరమైన సాంకేతిక సహకారం, సాప్ట్‌వేర్‌ను దిల్లీకి చెందిన గెట్‌వే పార్కింగ్ సంస్థ సమకూర్చగా మరింత మెరుగైన సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఆ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. నగరంలో పార్కింగ్ సమస్యలను సులభతరం చేసేందుకు చర్యలు తీసుకున్నారు.
ఈ విధానాన్ని ప్రస్తుతం పాతబస్తీలోని కేజీ మార్కెట్ సెల్లార్లో ప్రారంభించగా, ఆపై గవర్నరుపేటలోని ఎన్టీఆర్ సెల్లార్ పార్కింగ్, పాత బస్తీలోని కేబీఎన్ సెల్లార్ పార్కింగ్‌లో అందుబాటులోకి తెస్తున్నారు. ఆపై ఏలూరు రోడ్డులోని పలు ప్రాంతాల్లో అమలులోకి తేనున్నారు. వాహనదారులు డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించుకునే సదుపాయం ఉంది. ఫలితంగా నగదు రహిత చెల్లింపులు చేసుకునే అవకాశం కల్పించారు.
విజయవాడ నగరం ప్రస్తుతం 61.88 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే విస్తరించి ఉంది. అయితే వాహనాల సంఖ్య మాత్రం లక్షల్లోకి చేరిపోయింది. ఏలూరు, బందరు రోడ్డు, ఇక జాతీయ రహదారి ప్రాంతాలు కలుపుకుని నగరంలో 24 కిలోమీటర్ల వరకు ప్రధాన రహదార్లు ఉండగా, అంతర్గత రహదార్లు, మిగిలిన రహదార్లు మొత్తంగా 1238 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్నాయి. 2.38 లక్షల కుటుంబాలు, 10.97 లక్షల జనాభా ఉంది. ద్విచక్ర వాహనాలు 4.57 లక్షలు ఉండగా, కార్లు 60 వేలకు పైగా ఉన్నాయి. ఆటోరిక్షాలు రూ.28 వేలు, సరుకు రవాణా వాహనాలు 40 వేల వరకు ఉన్నాయి. ట్యాక్సీలు 6వేలు, విద్యాసంస్థలకు చెందిన బస్సులు 1700, ప్రయాణ బస్సులు 2250 వరకు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువగా ఉదయం, సాయంత్రం వేళల్లో నగరం నుంచి బయట ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండగా, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, చిన్నకార్లు, సరకు రవాణా వాహనాలు అధికంగా నగరంలోనే తిరగడం, పలు ప్రాంతాల్లో అనధికారిక పార్కింగ్ చర్యలకు పాల్పడడంతో నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, కెనాల్ రోడ్డు, పాతబస్తీ బీఆర్‌పీరోడ్డు, వస్త్రలత, శేషమహల్ ప్రాంతం, కేజీ మార్కెట్, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం, ఇతర వాణిజ్య సముదాయాలు, పలు ముఖ్యమైన కూడళ్లు, బస్‌స్టాపులు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, ఇతర వ్యాపార ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య, పార్కింగ్ ఇబ్బందులు తప్పడంలేదు. ప్రస్తుతం 25వేల నుంచి 30వేల వాహనాలు మాత్రమే పార్కింగ్ చేసుకునే వీలుండగా, స్మార్టు పార్కింగ్‌లో స్మార్టు పార్కింగ్‌కు అనుసంధానించి పార్కింగ్ చేయడం ద్వారా దాదాపు 50వేల వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.