డెంగీ.. ఉమ్మడి జిల్లాను వణికిస్తోంది. జనాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తెల్లబోతున్న రక్తకణాల రూపంలో దిగాలు పరుస్తోంది. అవసరానికి అందని కణాలు.. ముందుకు రాని రక్తదాతల రూపంలో బాధితుల్లో ఆవేదనను రగిలిస్తోంది. నానాటికి ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కేసులతోపాటు అడపాదడపా మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. లోపిస్తున్న పారిశుద్ధ్యమే శాపంగా అనారోగ్య పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అన్నివర్గాల ప్రజల్ని ఆర్థికంగా దివాలు పరుస్తున్నాయి.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలోనే ఈ నెల 15 రోజుల్లో 64మందికి డెంగీ సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాకు చెందిన వారంతా జ్వరాలతో బాధపడుతూ కరీంనగర్‌ప్రభుత్వాసుపత్రికి వస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో డెంగీని నిర్ధారించే ఎలిషా (ఎంజైమ్- లింక్‌డ్ ఇమ్యునోసోర్బెంట్ అస్సేస్) పరీక్ష కరీంనగర్‌లోనే ఉండటంతో ఇక్కడికి బాధితులు వరుస కడుతున్నారు. దీంతోపాటు ప్రైవేటు వైద్యకళాశాలలోనూ మరిన్ని కేసులు నమోదయ్యాయి. ఇవే కాకుండా నాలుగు జిల్లాల పరిధిలో ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ లక్షణాలతో చికిత్స పొందుతున్న వారు వందల సంఖ్యలో ఉంటున్నారు. కేవలం జిల్లాసుపత్రిలోనే గడిచిన మూడు నెలల కాలంలో అధికారికంగా ధ్రువీకరించినవి మాత్రం 126 వరకున్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో మృతుల సంఖ్య పదుల సంఖ్యలో ఉండటం రోగుల్లో ఆందోళనను పెంచుతోంది. ఇక్కడి ఆస్పత్రికి జ్వరాలు సహా వ్యాధి నిరోధక శక్తి తగ్గి తెల్లకణాలు లోపించి వస్తున్న వారి సంఖ్య రోజులో సుమారు 60-80 వరకుంటుంది.
ఆస్పత్రిలో జ్వరపీడితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. లక్ష వరకు ఉండాల్సిన తెల్లరక్తకణాల సంఖ్య అనూహ్యంగా 15, 20వేలకు పడిపోతుండటం వల్ల బాధితులకు వాటిని తిరిగి ఎక్కించేందుకు అపసోపాలు పడుతున్నారు. రోగి వెంబడి వచ్చిన వారితోపాటు సమీప బంధువులు రక్తాన్ని ఇస్తేనే వారి ఆరోగ్యం కుదుట పడే అవకాశం ఉంటుంది. జిల్లా కేంద్రంలోని రక్తనిధి కేంద్రంలో సేకరించిన రక్తం నిల్వలు అధికంగానే ఉన్నప్పటికీ ప్లేట్‌లెట్స్‌లను మాత్రం ఎప్పటికప్పుడే సేకరించి రోగి శరీరంలోకి పంపించేలా చూస్తున్నారు. ఇక్కడి ఆస్పత్రికి వచ్చే వారంతా పేదలే ఉండటం వచ్చిన వారికి సరైన మోతాదులో కణాల్ని అందించడం ఇబ్బందికరంగా మారిపోతోంది. ఐదు రోజులకు మించి ఇవి నిల్వ ఉండకపోవడం ఒక్కో బాధితులకు ఐదారు ప్యాకెట్‌లను అందించాల్సి రావడంతో దాతల కోసం వేడుకోలు తప్పడంలేదు. కరీంనగర్ జిల్లాకేంద్రంలో రోజుకు ఇలా రోగుల సంబంధీకులు 10-15 మంది వరకు వస్తున్నారు. ఆర్డీపీ విధానంలో రక్తం నుంచి తెల్లరక్తకణాల్ని వేరు చేస్తారు. అదే ఎస్డీపీ విధానంలో నేరుగా రక్తదాత నుంచి కేవలం తెల్లరక్తకణాల్ని మాత్రమే సేకరిస్తారు. మారుమూల ప్రాంతాలనుంచి వచ్చిన వారు మాత్రం దాతలు దొరకక వైద్యులను తోచిన కాడికి వైద్యం చేయమని.. భారమంతా భగవంతునిదేననేలా చికిత్స కోసం తల్లడిల్లుతున్నారు. ఈ ఏడాది మేనెలలో ఎస్‌డీపీ-2, ఆర్డీపీ-116, జూన్ నెలలో ఎస్డీపీ-2, ఆర్డీపీ-116, జూలైలో ఎస్డీపీ-4, ఆర్డీపీ-505, ఈ నెలలో గడిచిన 15 రోజుల్లో ఎస్డీపీ-1, ఆర్డీపీ-436 మంది తెల్లరక్తకణాల్ని బాధితులకు అందించేందుకు ఆస్పత్రికి వచ్చారు.