అన్న ఆళగిరితో అసలే తలబొప్పి కట్టుంటే చెల్లెలు కనిమొళి సయితం అలకపాన్పు ఎక్కారు. పార్టీలో తనకు కీలకమైన పదవి ఇవ్వాలని కనిమొళి పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే కనిమొళికి పదవి ఇచ్చే విషయంలో కుటుంబ సభ్యుల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. కనిమొళిని పదవులకు దూరంగా ఉంచాలని, ఇప్పటికే డీఎంకే మహిళా విభాగం కార్యదర్శిగా ఉన్న కనిమొళిని ఆ పదవిలో కొనసాగించాలని కుటుంబ సభ్యుల్లో ఎక్కువ మంది కోరుతున్నారు. కీలకమైన పదవి తనకు ఇవ్వాలంటూ చెల్లెలు కనిమొళి స్టాలిన్ వద్దకు రాయబారం పంపడంతో ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు స్టాలిన్. చివరకు కుటుంబ సభ్యుల వత్తిడి కంటే పార్టీ క్యాడర్ మనోభిప్రాయానికే స్టాలిన్ విలువ ఇచ్చే అవకాశముందంటున్నారు.కనిమొళి కరుణానిధికి గారాలపట్టీ. చిన్నతనం నాటి నుంచే కనిమొళికి కరుణ వద్ద చనువెక్కువని చెబుతారు. తండ్రి ప్రోద్బలంతోనే కనిమొళి రాజకీయాల్లోకి వచ్చారు. పార్లమెంటు సభ్యురాలిగా చేశారు కరుణ. అలాంటిది 2జీ కుంభకోణం కేసులో కనిమొళి తీహార్ జైలులో శిక్ష అనుభవించారు. ఈ సమయంలో కరుణ విలవిలలాడిపోయారు. స్వయంగా జైలుకు వెళ్లి చూసి వచ్చారు కరుణ. అలా కరుణకు కనిమొళి అంటే ఎనలేని ప్రేమ. ఈ విషయం పార్టీలోని అందరికీ తెలుసు. అందుకే కనిమొళికి పార్టీలో కీలక స్థానం ఇవ్వాలంటూ పార్టీ నేతలు కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. మారన్ సోదరులు కూడా కనిమొళికి ముఖ్యమైన పదవి ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నారని తెలిసింది.అన్న ఆళగిరిపై స్టాలిన్ కు నమ్మకం లేదు. పార్టీలోకి తిరిగి తీసుకుని పదవి ఇచ్చినా తనను ముంచేయడన్న గ్యారంటీ లేదు. ఆళగిరికి స్టాలిన్ సోదరి సెల్వి మద్దతు ఉందని చెబుతున్నారు. ఆళగిరికి పదవి ఇవ్వాలని సెల్వి స్టాలిన్ కు నచ్చ జెబుతున్నారు. ఆళగిరి ఎప్పుడు ఏం చేస్తారో తెలియని పరిస్థితుల్లో స్టాలిన్ ఆయనకు పదవి ఇచ్చే అవకాశం లేదు. అలాగని కనిమొళిని కూడా పదవి ఇవ్వకుండా దూరం పెడితే కుటుంబ సభ్యుల విషయం పక్కన పెట్టినా పార్టీ క్యాడర్ లో కొంత అసంతృప్తి బయటపడే అవకాశముందని భావిస్తుందన్నారు. కనిమొళి ఇప్పటికే అసంతృప్తికి గురయ్యారని చెబుతున్నారు.కనిమొళి తొలి నుంచి స్టాలిన్ కు అండగానే ఉంటున్నారు. కరుణ రాజకీయ వారసత్వానికి స్టాలిన్ అర్హుడని ఆమె పలు సంఘటనల్లో చెప్పకనే చెప్పారు. ఆళగిరి విషయంలో మాత్రం కనిమొళి దూరం పాటిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కనిమొళికి పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలని స్టాలిన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల్లో ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నా ప్రస్తుతం కనిమొళి సహకారం స్టాలిన్ కు అవసరం. అందుకే ఆమెను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించాలని స్టాలిన్ భావిస్తున్నారని డీఎంకే వర్గాలు వెల్లడించాయి. మరి కనిమొళి ఈపదవితో సంతృప్తి పడతారా? లేదా? అన్నది తెలియాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.