ఏపీ కాంగ్రెస్‌లో ఆ పార్టీకి చెందిన మాజీ నేతలంతా తిరిగి చేరడంతో పార్టీ పుంజుకుంటుందని అంతా భావించారు. అయితే ఆ విధమైన ఛాయలు ఎక్కడా కనిపించడంలేదనే వార్తలు ఇటీవల వినిపిస్తున్నాయి. మాజీ సీఎం కిరణ్ కుమార్ చేరికతో పార్టీకి జవసత్వాలు వస్తాయని అంతా అనుకున్నారు. దీనికితోడు పార్టీ పూర్వవైభవానికి పెద్దపెద్ద ప్రణాళికలు వేశారు. అయితే ఇవేవీ ఆచరణకు నోచుకోవడం లేదని తెలుస్తోంది. ప్రజలలోకి కాంగ్రెస్ నేతలు వెళితే ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయోననే సందేహంతోనే వారనుకున్న కార్యక్రమాలు చేపట్టడం లేదని సమాచారం. ఏపీలో ఇక కాంగ్రెస్ పని అయిపోయందన్న భావన ఏర్పడిన తరుణంలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అవకాశంగా తీసుకుని బలపడేందుకు కసరత్తు చేద్దామని నేతలు అనుకున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే ఆపరేషన్ స్వగృహను ప్రారంభించిన నేతలు ఆయా జిల్లాల పార్టీ కార్యకర్తలతో సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే దీనివల్ల ఫలితాలు ఏ మేరకు వచ్చాయనేది సందేహాస్సందేహంగానే ఉందని తెలుస్తోంది. ప్రజలను తిరిగి తమ వైపు మరల్చుకునేందుకు వాడవాడలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.
అయితే అటువంటి కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అన్ని చోట్లా వీధికూడలి ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించాలని పార్టీ నేతలు నిర్ణయించినప్పటికీ, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి, దీనికితోడు పార్టీ గతంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, భవిష్యత్తులో చేపట్టే పథకాలను ప్రచారం చేయడానికి సూచికగా బోర్డులను ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ వాటి ఆనవాళ్లు ఎక్కడా కనిపించడంలేదు. అలాగే విభజన పాపం తమ ఒక్కరిదే కాదని అన్ని పార్టీలు లేఖలు ఇచ్చినందునే ఇది జరిగిందని కూడా ప్రజలకు వివరించాలనుకున్నప్పటికీ, దీనిని గట్టిగా చెప్పేందుకు సరైన నాయకుడు దొరకక సతమతమవుతున్నారని సమాచారం. ప్రచారం సంగతి ఎలా ఉన్నా టిక్కెట్ల వేటలో కాంగ్రెస్ నేతలు ముందుంటున్నారని తెలుస్తోంది. దీనికితోడు మూడు నెలల ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు అధిష్టానం ప్రణాళిక సిద్ధం చేసిందంటున్నారు. అలాగే పార్టీలో రోజురోజుకూ ఆశావహుల సంఖ్య పెరుగుతుండటతో సర్వేల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలన్న నిర్ణయానికి పార్టీ నాయకత్వం వచ్చినట్లు తెలుస్తోంది.