YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శోభాయమానంగా వరలక్ష్మీవ్రతం

 శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శోభాయమానంగా వరలక్ష్మీవ్రతం
సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఉదయం వరలక్ష్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది.  వరలక్ష్మీవ్రతం సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీపద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి, తామరపూలు, మెగళిరేకులు వంటి సాంప్రదాయ పుష్పలతో అమ్మవారిని ఆరాధించారు.  ఆస్థానమండపాన్ని అష్టలక్ష్మిమూర్తులతో, రోజాలు, తామరపూలు లాంటి రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని 9 గ్రంథులతో(నూలుపోగు) అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఓం శ్రీ కమలాయైనమః, ఓం శ్రీ రమయైనమ, ఓం శ్రీ లోకమాత్రేనమ, ఓం శ్రీ విశ్వజనన్యైనమః, ఓం శ్రీ మహాలక్షియైనమః, ఓం శ్రీ క్షీరాబ్దితనయైనమః, ఓం శ్రీవిశ్వసాక్షిన్యైనమ, ఓం శ్రీ చంద్ర సహోదరిన్యై నమః, ఓం శ్రీ వరలక్ష్మియై నమః అని ఆరాధించారు. 
 వేంకటాచల మహత్యం స్కాంద పురాణంలో సూత మహర్షి వివరించిన వరలక్ష్మీ వ్రతం మహత్యాన్ని ఆలయ ప్రధానార్చకులు  శ్రీనివాసాచార్యులు భక్తులకు తెలియజేశారు. త్రేతాయుగంలో కుండలినీ నగరంలో నివసించిన చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మీ నోము ఆచరించి పొందిన ఫలప్రదాన్ని ఈ సందర్భంగా వివరించారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ప్రీతితో అవతరించిన తిరుచానూరులో వరలక్ష్మీవ్రతంలో పాల్గొన్న భక్తులకు విశేషమైన ఫలితం సిద్ధిస్తుందని ఆయన తెలిపారు.
తరువాత ఐదు రకాల కుడుములు, ఇడ్లి, కారంతో చేసిన ఇడ్లి, తియటి ఇడ్లి, లడ్డు, వడ, అప్పం, పోలి వంటి 12 రకాల నైవేధ్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది.
ఈ సందర్భంగా టిటిడి ఈవో ఏకే సింఘల్ మాట్లాడుతూ సాక్షత్తు శ్రీ మహాలక్ష్మీ అవతరించిన దివ్యస్థలం తిరుచానూరులో శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఆలయం వద్ద ఉన్న ఆస్థాన మండపంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం అర్చకులు వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత, అచరించవలసిన విధానాన్ని తెలియచేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తుందన్నారు. కావున  శ్రవణ మాసంలో ఈ వ్రతం చేసిన మహిళలకు సత్సంతా,నం దీర్ఘమాంగల్యసౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబసౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తుందన్నారు. ఈ పర్వదినాన అమ్మవారికి బంగారుచీరతో విశేష అలంకరణ చేసినట్లు వివరించారు. 
తిరుపతి జెఈవో  పోల భాస్కర్ మాట్లాడుతూ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయంలో ఆస్థాన మండపంలో భక్తులను ఆకట్టుకునేలా వివిధ రకాల పుష్పాలతో, విద్యుద్దీపాలతో అలంకరించినట్లు తెలిపారు. అదేవిధంగా దాదాపు 5 వేల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నామన్నారు. వ్రతంలో పాల్గొన్న భక్తులకు కంకణాలు, పసుపు దారాలు, పసుపు, కుంకుమ, గాజులు పంపీణి చేస్తున్నట్లు తెలిపారు.  

Related Posts