వృత్తిపట్ల అంకితభావం రోగులకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే డాక్టర్లు పనిచేయాలని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం దక్షిణ భారతదేశంలో ఆరోగ్య వైద్య ఆరోగ్య సంబంధమైన సేవలలో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిని షీలా నగర్ లో ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిమ్స్ ఆసుపత్రుల సేవల మూలంగా దేశంలో ప్రజల ఆయుప్రమాణం పెరిగిందని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేరు సంపాదించుకున్న దని తెలిపారు. షీలా నగర్ లోని 434 పడకల ఆసుపత్రి రోగులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. నిరుపేదలకు వైద్యం అందేలా ఆధునిక వైద్య పరికరాలు సదుపాయం ఈ ఆసుపత్రిలో ఉన్నదని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పాటు ప్రైవేటు ఆసుపత్రుల కూడా పేదలకు వైద్య సహాయం అందించాలన్నారు. ప్రపంచానికి వైద్యం మనమే పరిచయం చేశామన్నారు. పూర్వకాలంలో భారతీయ వైద్యం దేశవిదేశాలలో ప్రాచుర్యం పొందిందన్నారు. ఆధునిక కాలంలో కూడా మనదేశంలో వైద్య సేవలు విస్తృతం అయ్యాయని అన్నారు. తెలుగు రాష్ట్రాలకు చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా వైద్యం చేయించుకుంటున్నారని ఆయన తెలిపారు. ప్రజలు వివిధ రోగాల బారిన పడకుండా తగిన ముందు జాగ్రత్తలు తీసుకునేలా వైద్యులు వారికి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకర జీవన ప్రమాణాలను పాటించాలన్నారు. శారీరక వ్యాయామం ముఖ్యంగా యోగ మొదలైన వి క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పూర్వులు ఏనాడో ఉటంకించారు అని తెలిపారు. మన పూర్వులు మాధవ సేవే మానవ సేవ అని కూడా పేర్కొన్నారని దాన్ని ఆచరిస్తూ డాక్టర్లు ప్రభావంతో పనిచేయాలన్నారు. కేవలం ధనార్జనే ప్రధానంగా కాకుండా పేదలకు వైద్యం చేస్తూ ఉండాలని పిలుపునిచ్చారు. కొత్త కొత్త పరిశోధనలతో అందుబాటులోనికి వస్తున్న మందులు వైద్య ప్రక్రియను డాక్టర్లు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి చెప్పారు. డాక్టర్లు వారానికి ఒకరోజు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. మంచి అలవాట్లు గురించి కూడా చెప్పాలని, పర్యావరణం ఆహారం వ్యాయామాలను గూర్చి తెలియ జేయాలన్నారు. అలాగే ప్రజలు ప్రకృతి ప్రసాదించిన ఆహారాన్ని స్వీకరించే విధానాన్ని అలవరచుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో రహదారులు భవనాల మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంటు సభ్యులు కంభంపాటి హరిబాబు, రాజమండ్రి పార్లమెంటు సభ్యులు ఎం మురళీమోహన్, శాసనమండలి సభ్యులు పప్పల చలపతిరావు, శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్, పివిఆర్ నాయుడు, విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసీరావు, పోర్టు చైర్మన్ ఎన్ టి కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్ సిటీ పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లబ్ద, కిమ్స్ ఆసుపత్రి చైర్మన్ బొల్లాని కృష్ణయ్య, ఎండి డాక్టర్ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.