YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

క్యాన్సర్ వ్యాధి నివారణలో భారత్ ను అగ్రస్థానంలో నిలపాలి - భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు

క్యాన్సర్ వ్యాధి నివారణలో భారత్ ను అగ్రస్థానంలో నిలపాలి  - భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు

క్యాన్సర్ వ్యాధిని అరికట్టడంలో భారత దేశాన్ని అగ్రస్థానంలో నిలపాలని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. శాస్త్ర సాంకేతిక అణుశక్తి రంగాలలో గణనీయమైన పురోభివృద్ది సాధించాలని స్పష్టం చేసారు. భారత దేశం గర్వించే విధంగా హోమీ జహంగీర్ బాబా గొప్ప అణు పరిశోధనలు చేశారని చెప్పారు. శుక్రవారం స్థానిక ఉడా చిల్డ్రన్ థియేటర్ లో బాబా అటమిక్ పరిశోధనా కేంద్రం, హోలి బాబా క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్తంగా శాస్త్రవేత్తలతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత పరిశోధనా ఫలాలు సామాన్యులు, రైతులకు చేరాలన్నారు. దేశంలోని 58 విశ్వవిధ్యాలయాలను సందర్శించానని, 29 స్నాతకోత్సవాలలో పాల్గొన్నానని చెప్పారు. రైతులతో పరస్పరం చర్చించి రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాలని సూచించారు. భారత దేశ సంస్కృతి, ఆచార సాంప్రదాయాలను పరిరక్షించాలని చెప్పారు ప్రజలు సామాజిక సమస్యలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతీది ప్రభుత్వం పనే మనకెందుకులే అనే ధోరణ విడనాడాలని హితవు పలికారు. భారత ప్రధాన మంత్రి స్వచ్చభారత్ , బేటి బచావో, బేటిపడావో కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. పరిశోధనలకు , అభివృద్దికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ప్రకృతిలో వస్తున్న మార్పుల వలన హుద్ హుద్ , సునామి వంటి విపత్తులు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన భాద్యత అందరిపైనా ఉందన్నారు. భారత వైద్య పరిశోధనా సంస్థ ప్రతి రోజు సుమారు 12 నుండి 13 లక్షల కొత్త క్యాన్సరు రోగులను గుర్తిస్తున్నారన్నారు. ప్రారంభదశలోనే గుర్తించి మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణ, గ్రామీణ భారత దేశంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని సకాలంలో చికిత్స అందించాలని చెప్పారు. పొగాకు వినియోగం వలన క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 60 శాతం మంది తల, మెడ క్యాన్సరు వ్యాధితో బాధపడుతున్నారన్నారు. క్యాన్సరు నివారణకు స్పష్టమైన చర్యలు చేపట్టవలసిన అవసరం ఉందన్నారు. ఆధునిక జీవనశైలిలో మార్పులు రావాలని చెప్పారు. బార్క్ వంటి సంస్థలు తక్కువ వ్యయం, సాంకేతిక పరిజ్ఞానాలు, , పరికరాల అభివృద్ది చేయడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. ముందుగా అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియజేసారు. నేడు దేశంలో ఆహారపు అలవాట్లలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. ఆంధ్రా నాటు కోడి పులుసు, నెల్లూరు చేపలపులుసు, చింతచిగురు కూరలను, ఆంధ్రా పచ్చళ్లును విస్మరించి, మంచూరియా, జంకు పుడ్లకు ఆశక్తి చూపడం వలన వ్యాధులు పెరిగి పోతున్నాయని చెప్పారు.   ముందుగా బాబా అటమిక్ పరిశోధనా కేంద్రం, హోలీబాబా క్యాన్సర్ ఆసుపత్రి అధికార్లు తమ సంస్థలలో చేపడుతున్న కార్యక్రమాలు, సేవలను పౌవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.  ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యులు కె.హరిబాబు, జిల్లా కలక్టర్ ప్రవీణ్కుమార్, బార్క్ ప్రాంతీయ సంచాలకులు, డి.వెంకటేశ్వర్లు , హెచ్ బిసి ఆర్ సి అధికారి డా. రఘనాధరావు పలువురు శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts