సబ్జెక్టు టీచర్ల సర్దుబాటు ప్రక్రియ అపహాస్యమవుతోంది. అసలు సమస్య ఎక్కడుందో ఆయా ప్రాంతాల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సిన అధికారులు.. పక్షపాతం చూపుతున్నారు. అనుకూలురు.. టీచర్లకు సౌలభ్యం ఉన్న పాఠశాలలకు మాత్రమే సర్దుబాట్లు చేస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. ఈ కారణంగా చాలా స్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరత పదో తరగతి ఫలితాలపై ప్రభావం చూపనుందని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు చేస్తున్న సర్దుబాట్లను పరిశీలిస్తే విద్యార్థులకు ఒరిగేది శూన్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సబ్జెక్టు టీచర్లు లేని చోటుకు సర్‌ప్లస్(మిగులు) ఉపాధ్యాయులను మాత్రమే మార్పు చేయాలి. అయితే జిల్లా విద్యాశాఖ అధికఈ నిబంధనను గాలికొదిలేసి మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. ఆర్జేడీ సిఫారసు పేరిట సొంత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
కుందుర్పి మండలం నిజవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న బయలాజికల్ సైన్స్ టీచర్‌ను బుక్కపట్నం డైట్ కళాశాలకు గతేడాదే పంపారు. ఇప్పటిదాకా ఆమె స్థానంలో ఎవరినీ సర్దుబాటు చేయలేదు. సాధారణ బదిలీల్లో భాగంగా ఉన్న సోషల్ టీచర్ కూడా ఇటీవల రిలీవ్ అయ్యారు.శెట్టూరు మండలం తిప్పనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తగా అప్‌గ్రేడ్ అయింది. హెచ్‌ఎం పోస్టు లేదు. 6–10 తరగతుల విద్యార్థులు 150 మంది దాకా ఉన్నారు. ఫిజికల్ సైన్స్, బయాలజి సైన్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంబేద్కర్‌నగర్ పాఠశాల నుంచి ఒక గణితం టీచరును ఇక్కడికి సర్దుబాటు చేశారు. ఈయనకు అర్హత(టీటీసీ) లేదు. అయితే అంబేద్కర్ నగర్ స్కూల్‌కు గంటేదొడ్డి పాఠశాల నుంచి మరో టీచరును సర్దుబాటు చేశారు. తిప్పనపల్లిలో జెడ్పీహెచ్‌ఎస్ పక్కనే ఉన్న ప్రాథమిక స్కూల్‌లో ముగ్గురు టీచర్లు ఉన్నారు. వీరిలో క్వాలిఫైడ్ టీచరు(బీఈడీ) విల్లింగ్ ఇచ్చినా ఆయనను పరిగణలోకి తీసుకోకుండా ఎక్కడో అంబేద్కర్‌నగర్ పాఠశాల నుంచి సర్దుబాటు చేశారు.గుమ్మఘట్ట మండలం కలుగోడు జెడ్పీహెచ్‌ఎస్‌లో 150 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో పదో తరగతి విద్యార్థులు 41 మంది ఉన్నారు. ఇంగ్లిష్, బయాలజికల్ సైన్స్, సోషల్ సబ్జెక్టుల టీచర్లు లేరు.కుందుర్పి మండలం తూముకుంట ప్రాథమికోన్నత పాఠశాలలో 1–8 తరగతుల విద్యార్థులు 140 మంది ఉన్నారు. వీరిలో 6–8 తరగతుల విద్యార్థులు 50 మంది ఉన్నారు. యూపీ స్కూల్‌కు పండిట్, గణితం, ఇంగ్లిష్ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ పని చేస్తున్న ఇంగ్లిష్ టీచరును కళ్యాణదుర్గం బాలికల పాఠశాలకు సర్దుబాటు చేశారు. కళ్యాణదుర్గం స్కూల్‌లో నాలుగు పోస్టులు ఉన్నాయి. అదనంగా తూముకుంట నుంచి మరో టీచరును నియమించారు. మరి తూముకుంటలో ఉన్న 50 మంది పిల్లలకు ఇంగ్లిష్ ఎవరు బోధిస్తారు?.యర్రగుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 500 మంది విద్యార్థులు ఉన్నారు. ఇద్దరు ఇంగ్లిష్ టీచర్లు పని చేస్తున్నారు. వీరిలో ఒకరిని రాప్తాడు మండలం బండమీదపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు సర్దుబాటు చేశారు. ఈమె స్థానంలో అదే మండలం కొత్తపల్లి యూపీ స్కూల్ నుంచి మరో ఇంగ్లిష్ టీచర్‌ను సర్దుబాటు చేశారు. కొత్తపల్లి స్కూల్‌లో 200 మంది విద్యార్థులు ఉండగా ఇంగ్లిష్ ఒకే పోస్టు ఉంది. ఆ ఒక్క టీచర్‌ను బయటకు తీసుకొచ్చారు.