తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరందుకోగా.. ఏపీలోనూ ఎన్నికల వాతావారణం వేడెక్కింది. పార్టీలు చేరికలను ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా తొలిసారి ఎన్నికల బరిలో దిగబోతున్న జనసేన పార్టీలోకి నాయకులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే పవన్ ఆహ్వానం మేరకు కొందరు నేతలు పార్టీలో చేరారు. పవన్‌తో 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని జనసేన నాయకులు ప్రకటించడం గతంలో సంచలనమైంది. తాజాగా జనసేన పార్టీ రాష్ట్ర కన్వీనర్ వి.పార్థసారథి మరోసారి అలాంటి ప్రకటనే చేశారు. 20 మంది ఎమ్మెల్యేలు జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని పార్థసారథి తెలిపారు.వారంతా ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో చర్చించారని, ఆయన నిర్ణయాన్ని తీసుకున్నా ఆ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు మేడా గురుదత్ ప్రసాద్, ఉభయగోదావరి జిల్లాల కన్వీనర్ కలవకొలను తులసితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీలో నవ తరానికి 60 శాతం సీట్లు ఇస్తామని ఈ సందర్భంగా పార్థసారథి తెలిపారు. 2019 ఎన్నికల కోసంరాష్ట్రం మొత్తానికి ఓ మేనిఫెస్టో రూపొందిస్తామని, దీనికి అదనంగా ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో మేనిఫెస్టో రూపొందిస్తామని పార్థసారథి తెలిపారు.