ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పంటి చికిత్స ఖర్చుపై తాజాగా టీడీపీ వివరణ ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 12న సింగపూర్‌లోని 22 సిక్స్త్ అవెన్యూలోని అజురే డెంటల్ హాస్పిటల్‌లో యనమల రూట్ కెనాల్ చికిత్స చేయించుకోగా.. దానికి రూ. 2,88,823 ఖర్చు అయ్యింది. దీంతో.. ఆ మొత్తానికి బిల్లులు సమర్పించడంతో ప్రభుత్వం ఆమోదిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. భారత్‌లో తక్కువ ఖర్చతో పూర్తయ్యే ఈ చికిత్స కోసం సింగపూర్‌లో మంత్రి రూ. లక్షలు వెచ్చించడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి లంక దినకర్ వివరణ ఇచ్చారు. ‘సింగపూర్‌కి మంత్రి అధికారిక పర్యటనపై వెళ్లినప్పుడు.. టూర్ మధ్యలో భరించలేనంత నొప్పి వచ్చింది. దీంతో.. సమయం లేకపోవడంతో వెంటనే అక్కడే ఉన్న డెంటల్ ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. భారత్‌తో పోలిస్తే సింగపూర్‌లో ఈ చికిత్స ఖర్చు ఎక్కువ. అక్కడి డాక్టర్లు 4వేల నుంచి 5వేల సింగపూర్ డాలర్లు ఈ ట్రీట్‌మెంట్‌కి వసూలు చేస్తారు. మంత్రి సింగపూర్ పర్యటనకి వెళ్లక ముందు.. జూబ్లీహిల్స్‌లోని ఏపీ డెంటల్ ఆసుపత్రిలో డాక్టర్ కడియాల రాజేంద్ర పర్యవేక్షణలో చికిత్స తీసుకున్నారు. తాజా సింగపూర్ బిల్లుని ఆయన కూడా పరిశీలించి ఆమోదించారు’ అని దినకర్ వెల్లడించారు.