పాకిస్థాన్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్‌ఖాన్ సంచలన నిర్ణయాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా ఆయన మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. నిధుల వినియోగం విషయంలో ప్రజాప్రతినిధుల స్వేచ్ఛకు కళ్లెం వేయడంతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారుల ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించారు.ప్రధాని బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికారిక బంగ్లాను కాదన్న ఇమ్రాన్.. మిలిటరీ సెక్రటరీ నివాసంలోని ఓ చిన్న పోర్షన్‌లో ఉంటున్నారు. అంతేగాక.. ఖర్చులను తగ్గించడం కోసం రెండు వాహనాలు, ఇద్దరు సిబ్బందిని మాత్రమే నియమించుకున్నారు. ప్రభుత్వ నిధులను ఇష్టం వచ్చినట్టు వినియోగించడంపై ఇమ్రాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో పాటు ప్రధానమంత్రి, అధ్యక్షుడు, ప్రధాన న్యాయమూర్తి సహా ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎవరూ ఫస్ట్‌క్లాస్ విమాన ప్రయాణాలు చేయరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలో శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నట్లు పాక్ సమాచార మంత్రి ఫవాద్ చౌదరీ తెలిపారు.‘అధ్యక్షుడు, ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్, సెనేట్ ఛైర్మన్, జాతీయ అసెంబ్లీ స్పీకర్, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇకపై విమానాల్లో వెళ్లేప్పుడు ఫస్ట్‌క్లాస్‌లో కాకుండా బిజినెస్ లేదా క్లబ్ క్లాస్‌లోనే ప్రయాణించాలని క్యాబినెట్ నిర్ణయించింది’ అని చౌదరి వెల్లడించారు. అంతేగాక.. విదేశీ లేదా దేశీయ పర్యటనలు చేసినప్పుడు ప్రత్యేక విమానాలు వినియోగించకుండా నిషేధం తీసుకురావాలని ప్రధాని నిర్ణయించినట్లు చౌదరి తెలిపారు.ఇక ప్రధానమంత్రి, అధ్యక్షుడు సహా ఇతర అధికారులు ప్రభుత్వ నిధులను ఇష్టం వచ్చినట్టు వినియోగించడాన్నీ నిషేధిస్తూ పాక్ క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఒక ఏడాదిలో రూ. 5,100కోట్ల నిధులను స్వేచ్ఛగా వినియోగించారని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చౌదరి తెలిపారు.
ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలోనూ పనిగంటలను సవరిస్తూ ఇమ్రాన్‌ఖాన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటలు పనిచేస్తుండగా.. దాన్ని ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలకు మార్చారు. అంతేగాక.. వారానికి ఆరురోజులు పనిదినాలు చేయాలని నిర్ణయించిన్పటికీ.. కొందరు మంత్రులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వెనక్కితగ్గి.. ఐదు రోజుల పనిదినాలనే కొనసాగిస్తున్నారు.