రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ కర్నాటక పర్యటన రుసరుసలతో ముగిసింది. ఆమె కొడగు ప్రాంతంలో వరద బీభత్సాన్ని పరిశీలించారు. వరద పర్యటన చివరన కర్నాటక మంత్రి సారా మహేశ్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతుండగానే మంత్రి మహేశ్ సమయం లేదు మేడం.. త్వరగా ముగించండి అని సూచించారు. అలా చెప్పడం ఆమెకు నచ్చినట్టు లేదు. కేంద్రమంత్రికి రాష్ట్రమంత్రి చెప్పడమా అని ఊగిపోయారు. ఇదంతా నమ్మలేకుండా ఉంది అని కామెంట్ చేశారు. మేడం కెమెరాలు ఇటే చూస్తున్నాయి అని మహేశ్ అంటే కానీయండి అని చిర్రుబుర్రులాడారు. మీడియావైపు చూస్తూ ఏమైనా రికార్డు చేసుకోండి అన్నారు. ఈ ప్రవర్తనను నిరసిస్తూ ఉపముఖ్యమంత్రి జీ పరమేశ్వర ట్విట్టర్‌లో విమర్శలు సంధించారు. వరద పనుల్లో తలమునకలుగా ఉన్న నా సహచరునిపై మీరు అలా విరుచుకుపడడం ఏమీ బాగాలేదండీ అని సూటిగానే చురకలు వేశారు. అయినా కేంద్రం ఎక్కువ, రాష్ర్టాలు తక్కువ అని ఎక్కడాలేదని, రెండూ సమానమేనని పేర్కొన్నారు. రాష్ర్టాలకు అధికారాలు కేంద్రం ఇవ్వదని, అవి రాజ్యాంగం నుండి వస్తాయని ఉపముఖ్యమంత్రి పరమేశ్వర కేంద్రమంత్రికి గుర్తుచేశారు.