టీవీ, బెడ్, వ్యక్తిగత వెస్ట్రన్ టాయిలెట్, గాలి, వెలుతురు ఉండేలా విశాలమైన ప్రాంతం.. ముంబై జైలులో విజయ్ మాల్యాకు కల్పించనున్న సౌకర్యాలివి. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన విజయ్ మాల్యాను భారత్‌కు పంపిస్తే.. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉంచాలని భావిస్తున్నారు. ఈ జైలులోని 12వ నంబర్ బారక్‌లో హై ప్రొఫైల్ ఖైదీల కోసం ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. లండన్ కోర్టు ఆదేశాల మేరకు ఈ సదుపాయాల గురించి చూపిస్తూ తీసిన వీడియోను సీబీఐ కోర్టుకు పంపించింది. సుమారు 8 నిమిషాల నిడివి ఉన్న సదరు వీడియోలో జైల్లో మాల్యాకు లభించనున్న సదుపాయాల గురించి తెలిపారు.బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాను తిరిగి భారత్‌కు రప్పించడానికి సీబీఐ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మాల్యాను వెనక్కి పంపే అంశంపై లండన్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఇందులో భాగంగా అక్కడి కోర్టు విజయ్ మాల్యాను ఉంచాలనుకుంటున్న జైలు వీడియోను పంపించాలని గతంలో అడిగింది. దీంతో సీబీఐ ఆర్థర్ రోడ్ జైలులోని బారక్ నం.12ను వీడియో తీసి పంపించింది. భారత జైళ్లలో గాలి, వెలుతురు ఉండదని విజయ్ మాల్యా ఫిర్యాదు చేయడంతో అక్కడి కోర్టు జైలు వీడియో పంపాల్సిందిగా సీబీఐని అడిగింది. భారత్‌లోని జైళ్లలో పరిశుభ్రత ఎలా ఉంటుందో చూపించాలని లండన్ కోర్టు కోరడంతో.. ఇక్కడి జైలు పరిశుభ్రత, వైద్య సదుపాయాలను తెలుపుతూ వీడియో పంపామని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.. ఆర్థర్ రోడ్ జైలులోని బారక్ నంబరు 12ను భద్రత కారణాల దృష్ట్యా హై ప్రొఫైల్ ఖైదీల కోసం వినియోగిస్తున్నారు. ఈ జైలు గది తలుపు తూర్పు వైపు ఉంటుంది. కావాల్సినంత వెలుతురు వస్తుందని, వెంటిలేషన్ కోసం కిటికీలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. జైలు గది నుంచి బయటకు వెళ్లి నడిచేందుకు కొంత స్థలం కూడా ఉంటుందని వెల్లడించారు. సీసీటీవీ కెమెరాలు, అదనపు భద్రతా సిబ్బంది ఉంటారని తెలిపారు. నాలుగు సార్లు భోజన సదుపాయం ఉంటుందని చెప్పారు.