సర్గ-18
దశరథుడితో తానొచ్చిన కారణాన్ని చెప్పిన విశ్వామిత్రుడు
ఇలా తనను ప్రార్థించిన దశరథుడిని సంతోషంతో - వికాసంతో చూసిన విశ్వామిత్రుడు రాజును చూసి అంటాడీవిధంగా: " ఓ రాజేంద్రా! రఘువంశం సత్యసంధతకు, దాన మహిమకు ప్రపంచంలో ప్రసిద్ధిగాంచింది. అంత గొప్ప వంశంలో పుట్టిన నువ్వు ఈ రెండింటిలో దయాశతిశయంతో నన్ను మరచిపోయేటట్లు చేసావు. నీవంశమేమో సూర్యవంశం. కులగురువేమో వశిష్ఠుడు. నీగుణాలేమో లెక్కలేనన్నివి. ఇలాంటి నువ్వు ఎలామాట్లాడాలో, అలానే పలికావు. నేనేదికోరినా తప్పక ఇస్తానంటున్నావు. నా మనసులో వున్నదాన్నే నేనడుగుతాను. నా కోరికను నీవు నెరవేర్చి, దశరథుడు ఎట్టి సంకట సమయంలోనూ, ఆడితప్పేవాడు కాదన్న కీర్తిని సంపాదించుకో. ఇక నేను చెప్పాలనుకొంది చెప్తా విను. నేనిప్పుడొక యజ్ఞం చేద్దామని సంకల్పించుకొని, దీక్ష పూనాను. దాన్ని ఏవిధంగానైనా విఘ్నం చేయాలని మారీచ - సుబాహువులు అనే ఇద్దరు రాక్షసులు పంతం పట్టారు. వాళ్ళిదరూ కామరూపులు - దయాదాక్షిణ్యాలు లేనివారు - అస్త్ర లక్షణాలు తెలిసున్నవారు - మహా బలవంతులు - గురి తప్పక కొట్టగలిగే వారు. వాళ్ళేం చేస్తారంటావేమో? నెత్తురుని, మాంసాన్ని –కుప్పలు కుప్పలు గా యజ్ఞ వేదిక మీద గుమ్మరిస్తారు. సదస్యులను, వచ్చిన మునులను తన్ని, మేం చూస్తుండగానే చంపుతారు. వాళ్ళీవిధంగా యజ్ఞాన్ని విఘ్నం చేస్తున్నందువల్ల, ఉత్సాహమంతా పోయి, కష్టపడి నా ఆశ్రమాన్ని వదలి, నువ్వు సహాయం చేస్తావేమోనని అడుగుదామని ఆశతో వచ్చాను. నేను బాణం పట్టగలను కదా - శాపం పెట్టగలను కదా - ఎందుకు వారిని విలువిద్యతో జయించకూడదు - ఎందుకు శాపం పెట్టి చంపకూడదు అని నీవడుగవచ్చు. ఆపాపాత్ముల బల గర్వాలను అణచి వారిని యమలోకానికి పంపడానికి నాకు కష్టంకాదు. కాని, యజ్ఞ దీక్ష సమయంలో, నేను కోపంతో విల్లు పట్టకూడదు - శపించనూ కూడదు. మిగతా రోజుల్లో దండించుదామంటే వాళ్ళు రారు. యజ్ఞ సమయంలోనే వారిని దండించాలి".
శ్రీరాముడిని తనతో పంపమని దశరథుడిని అడిగిన విశ్వామిత్రుడు
తాను చెప్పదలుచుకొన్న విషయాన్ని కొనసాగిస్తూ విశ్వామిత్రుడు: " నాకు కావాల్సిన సహాయం ఏంటంటావా? పెద్దవాడివైన నీకు, నేను శ్రమివ్వదల్చుకోలేదు. కమలాలమీద తుమ్మెదల్లాగా, ముద్దైన ముఖం మీద ముంగురులతో, అందమైన జునపాలతో, బలానికి స్థానమైన నీ గారాల కొడుకు శ్రీరామచంద్రమూర్తిని-సత్యపరాక్రముడిని నాకివ్వు.రాక్షసులతో యుద్ధమన్నావుకదా! ఆరాక్షసులు మాయావులంటివికదా!మహాబల పరాక్రమ సంపన్నులంటివికదా! అస్త్ర వేదులని కూడా అన్నావుకదా! అలాంటప్పుడు, వాళ్ళతో యుద్ధంచేసేందుకు, జానెడు పిల్లవాడిని తీసుకొనిపోతే ప్రయోజనమేంటని నీకు అనుమానం రావచ్చు. నేను కాపాడుతున్నంతవరకూ, నీ కొడుకు, మారీచాది రాక్షసుల సమూహాన్ని సులభంగా చంపగలడు. వారి బలం -అతిశయం ఎంతదైనా, దయా ధర్మాలనే గుణాలు అసలే లేనందువల్ల, నీచులైనందువల్ల, అసాధ్యులుకారు. అయినప్పటికీ, వారిని చంపగల బలశాలి, ఒక్కశ్రీరాముడేకాని మరెవ్వరూలేరు. నా యజ్ఞాన్ని రక్షించగల సమర్థుడైన శ్రీరాముడిని నావెంటపంపు. నువ్వీకార్యాన్ని నెరవేరుస్తే, నీ కొడుకుకు నేనెన్నో శుభాలు కలిగిస్తాను. రాముడు లోకంలో విశేషమైన కీర్తిమంతుడిగా ప్రకాశిస్తాడు. వారెంత బలవంతులైనప్పటికీ, పాపాత్ములు - ధర్మహీనులు అయినందున, యుద్ధంలో శ్రీరాముడిని ఎదిరించి నిలువ లేరు. పాపం ఎంత బలంగా వున్నా ధర్మమే గెలుస్తుంది. రాముడు పసిబాలుడనీ - యుద్ధం చేసే శక్తిలేనివాడనీ, పుత్రుడిపైవున్న మోహాన్ని వదిలిపెట్టు. రాక్షసులు నీ కొడుకు ఎదుట నిలవలేరని ప్రమాణంచేసి చెప్తున్నాను" అని అంటాడు.
సంసారిగా వున్న దశరథుడికి పుత్రుడిపై మోహమెందుకుండదు? ఆయనకొడొకు బలాబలాలు, ఆయనకన్నా ఎక్కువగా విశ్వామిత్రుడికెట్లా తెలుసును అన్న సందేహం కలగొచ్చు. శ్రీరాముడు పేరుకే దశరథుడి కొడుకు - నిజానికి లోకాలకెల్ల తండ్రి. ఆవిషయాన్నే చెప్తూ, శ్రీరాముడు లోకాన్ని ఉద్ధరించడానికై పుట్టాడు కాని, దశరథుడి ఇంట్లో సుఖపడడానికి కాదంటాడు విశ్వామిత్రుడు. శ్రీరాముడు తన కొడుకని దశరథుడికెంత ప్రేముందో, జగజ్జనకుడైన ఆయనకు అంతకన్నా ఎక్కువ ప్రేమ లోకంమీదుంది. సత్య మెరుగని దశరథుడు శ్రీరాముడిని తనకుమారుడనే తలబోస్తున్నాడనీ, సత్యమెరిగిన తనలాంటివారు, ఆయనను భగవంతుడిగా చూస్తున్నారనికూడా అంటాడు. ఆయన అందరి సొత్తుకాని, కేవలం దశరథుడొక్కడి సొత్తుకాదని విశ్వామిత్రుడు స్పష్ఠంచేస్తాడు. "రాజేంద్రా! శ్రీరాముడి సత్య పరాక్రమం నాకు తెలుసు. కావాలంటే వశిష్ఠుడిని అడుగు. అంతటితో తృప్తికలగపోతే ఇక్కడున్న తపస్వులనందరినీ అడుగు - వీరందరికీ శ్రీరాముడి మహిమ తెలుసు. నీకు ధర్మాన్ని అభివృద్ధిచేసి వూర్ధ్వలోకసుఖం అనుభవించాలని వుంటే - మంచి కీర్తివంతమైన ఐహిక ఫలాలను అనుభవించాలని వుంటే, శ్రీరామచంద్రుడిని నాతో పంపు. పనికిమాలిన సందేహాలన్నీ వదిలిపెట్టు. పంపకపోతే నీకింక ఇహ-పరాలుండవు. వశిష్ఠుడు - ఇతర పురోహితులు, సుమంత్రుడు - ఇతర మంత్రులు, నీ కొడుకును నా వెంట పంపమని అంటేనే పంపు. వాళ్ళు వద్దంటే మానేయి. నేను చేయబోయే యజ్ఞం పూర్తవడానికి ఈ రోజునుండి పది రోజుల సమయముంది. ఈ యజ్ఞం రాక్షసులవల్ల విఘ్నం కాకుండా కాపాడబడాలి. దీక్షా కాలం మించిపోక ముందే నీ కొడుకును నా వెంట పంపు" అని తాను చెప్పదల్చుకొన్నది పూర్తిగా చెప్పి, యజ్ఞం పేరుతో శ్రీరాముడిని తన వెంట తీసుకొనిపోయి, వారితో మారీచ - సుబాహులను చంపించి, వారికి శ్రేయస్సు కలిగించాలని తాను తలంచిన విషయాన్నంతా చెప్పి, దశరథుడి సమాధానం కొరకు మౌనం దాల్చాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని తన వెంట పంపమన్న మాట వినగానే దశరథుడి ముఖం విలవిల బోయింది. పెద్దాయనకు మాట ఇచ్చానే! ఎట్లా తప్పాలి! మాటతప్పకుండా శ్రీరాముడి నెట్లా పంపాలి? పంపితే రాముడిని విడిచి ఎట్లా బతకాలి? ఇప్పుడు అవునంటానికీ లేదు - కాదని అంటానికీ లేదని తనలో తానే అనుకుంటూ, విశ్వామిత్రుడి మాటలు విన విననట్లు, విషాదంగా కూర్చొన్నాడు దశరథుడు. కాసేపయింతర్వాత తననే రమ్మనకపోతాడానన్న ధైర్యంతో వేచిచూసినప్పటికీ, విశ్వామిత్రుడి నోట అలా రాకపోయే సరికి, ఆశ వదలి గుండెలు పగిలి దుఖఃసముద్రంలో మునిగి - స్మృతి తప్పి పడిపోయాడు దశరథుడు.