- లూలూకు అప్పనంగా అప్పగిసున్న సర్కారు భూములు
- సీఎంఆర్ సంస్థ నుంచి 3.40 ఎకరాల సేకరణ... బదులు 4.85 ఎకరాల సమర్పణ
- 1500 కోట్ల స్థలానికి ఏడాది లీజు 7 కోట్లే.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనలు
- రిజిస్ట్రేషన్.. స్టాంపు డ్యూటీ మినహాయింపు
ఒక ప్రైవేటు సంస్థ కోసం విశాఖపట్నంలో వెయ్యి కోట్ల రూపాయులకు పైగా విలువైన ప్రభుత్వ స్థలాలు ప్రైవేటుపరం కాబోతున్నాయి. ప్రైవేటు సంస్థలకు ఉదారంగా ఇస్తున్న పన్ను రాయితీల వల్ల ప్రభత్వ ఖజానాకు మరో రూ. 150 కోట్ల గండి పడుతోంది. ఇదంతా ‘లూలూ’ సంస్థపై ప్రభుత్వం చూపుతున్న మితిమీరిన ప్రేమకు ప్రతిఫలం. లూలూ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫైవ్‌స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్‌ల పేరిట 1500 కోట్ల రూపాయల కుంభకోణానికి రంగం సిద్ధమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం సీఎంఆర్ సంస్థ నుంచి మూడున్నర ఎకరాలను తీసుకొంటున్న ప్రభుత్వం.. చిత్రంగా ఆ సంస్థ నగరంలోని ప్రభుత్వ స్థలాలన్నింటినీ పరిశీలించి ఏవి కావాలని కోరితే వాటిని ఇచ్చేసేందుకు సిద్ధపడింది. ఈ సంస్థ నుంచి తీసుకొంటున్న సీఆర్‌జడ్ పరిధిలోని 3.40 ఎకరాలకు ప్రత్యామ్నాయంగా నగరం నడిబొడ్డున నాలుగుచోట్ల ఉన్న అత్యంత విలువైన 4.85 ఎకరాలను ఇవ్వడానికి సిద్ధపడడం అసలు విశేషం. ప్రత్యామ్నాయ స్థలాల కేటాయింపు సందర్భంగా రిజిస్ట్రేషన్, స్టాంప్‌డ్యూటీ వంటి వాటినన్నింటినీ మినహాయించడం వల్ల ప్రభుత్వం మరో రూ. 171.27 కోట్ల ఆదాయాన్ని కోల్పోనుంది. సీఎంఆర్ కోరుకొన్న విధంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ స్థలాలను ఇవ్వడం వల్ల నగరంలో కేంద్రం రూ.60 కోట్లతో నిర్మించనున్న ఐటీ టవర్లు, బీచ్‌రోడ్‌లో పర్యాటకశాఖ నిర్మించతలపెట్టిన హోటల్, ఎంవీపీ కాలనీలోని డ్వాక్రా బజార్, సీతమ్మధారలోని మరో విలువైన స్థలం కనుమరుగైపోనున్నాయి. ఇదంతా లూలూ గ్రూపు ఏటా చెల్లించే రూ.6.27 కోట్ల లీజు కోసం మాత్రవేునంటే ఆశ్చర్యం కదూ! టెండర్ మధురవాడలో.. లూలూ కోసం నగరంలోకి
ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా విశాఖలో కన్వెన్షన్ సెంటర్ కోసం టెండర్ పిలిచింది మధురవాడ ప్రాంతంలో. అయితే ఆ టెండర్‌ను పక్కన పెట్టేసిన ప్రభుత్వ పెద్దలు ‘లూలూ’ కోసం నగరం నడిబొడ్డున రామకృష్ణ బీచ్‌కు దగ్గరలోని 9.12 ఎకరాలను రంగంలోకి తీసుకొచ్చారు. బహిరంగ టెండర్ లాంటివి ఏమీ లేకుండా పీపీపీ పేరిట ఆ సంస్థకు ఈ స్థలాన్ని కట్టబెట్టేందుకు ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం కూడా తెలిపారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఈ స్థలానికి బీచ్‌రోడ్ ఫేసింగ్ లేకపోవడంతో పక్కనే ఉన్న సీఎంఆర్‌కు చెందిన విశ్వప్రియ ఫంక్షన్ హాలుపై దృష్టిపడింది. 3,40 ఎకరాల ఫంక్షన్ హాలు స్థలాన్ని సేకరించేందుకు నోటీసు ఇచ్చిన ప్రభుత్వం... వాళ్ల కోసం భూమికి భూమి అంటూ విచిత్రమైన ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. శాస్త్రీయంగా, వాస్తవంగా అంచనాలు వేయకుండా సీఎంఆర్‌కు నగరంలోని విలువైన ప్రభుత్వ స్థలాల జాబితాను ఇచ్చి వాటిలో ఏది కావాలో ఎంచుకోమంది. దీంతో, సిరిపురం మడాను ఆనుకొని ఉన్న ఐటీ టవర్ ప్రతిపాదిత స్థలం, బీచ్‌రోడ్‌లోని పర్యాటక శాఖ స్థలం, ఎంవీపీ కాలనీ రైతుబజారుకు ఆనుకొని ఉన్న డ్వాక్రాబజార్ స్థలం, హెచ్‌బీ కాలనీలోని మరో విలువైన స్థలం కావాలని సీఎంఆర్ కోరడం.. వెంటనే ఓకే అనేయడం జరిగిపోయాయి. సీఎంఆర్ బీచ్ రోడ్‌లో ఇస్తున్న 3.40 ఎకరాలకు ప్రత్యామ్నాయంగా దానికి రెట్టింపు విలువైన మొత్తం 4.85 ఎకరాలను ఇవ్వడానికి సిద్ధపడటం ఇందులోని విచిత్రం. పైపెచ్చు దీనికి అన్నిరకాల పన్నుల మినహాయింపు ఇవ్వడం ఇంకో విశేషం.
నిబంధనలకు విరుద్ధం.. పెద్ద స్కాం
రెండు ప్రైవేటు సంస్థలకు నగరంలోని 14 ఎకరాల భూమిని వందల కోట్లు నష్టపోయి కట్టపెట్టడం 2013 భూసేకరణ చట్టానికి, ఇతర నిబంధనలకు పూర్తి విరుద్ధమని ఫోరం ఫర్ బెటర్ విశాఖ కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. ఇది వందలకోట్ల కుంభకోణమని, ప్రైవేటు సంస్థల కోసం ప్రజోపయోగ స్థలాలను ఇలా ఇచ్చేయడం చట్టాలను ఉల్లంఘించడమేనంటూ ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ కేటాయింపులను నిలిపివేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సివస్తుందని స్పష్టం చేశారు.
లోకేశ్ కోసమే ఇదంతా..
ముఖ్యమంత్రి తనయుడు లోకేశ్ బినామీగా లూలూ సంసథ విశాఖకు వస్తోందని వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన మీడియాతో అన్నారు. ప్రైవేటు సంస్థల నుంచి వందల కోట్లలో ముడుపులు పుచ్చుకొనే ఒప్పందాల్లో భాగంగానే నగరంలోని విలువైన భూములు ప్రైవేటు పరమౌతున్నాయని అన్నారు. లూ లూ, సీఎంఆర్ సంస్థలకు భూకేటాయింపులను నిలిపివేయాలని సీపీఎం కూడా డిమాండు చేసింది. దీనిపై ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని పార్టీనేత నరసింగరావు స్పష్టం చేశారు.