ఈరోజు అంటే శ్రావణ బహుళ పాడ్యమి(ఆగష్టు27) నుంచి జన్మాష్టమి అంటే శ్రావణ బహుళ అష్టమి(సెప్టెంబర్3) వరకు చేసే ఉపాసనని జన్మాష్టమి ఉపాసన అంటారు. అంటే ఈ 8 రోజులు భక్తులు పరమభక్తితో, నియమ నిష్టలతో శ్రీకృష్ణ పరమాత్మను ఉపాసన చేస్తారు. శ్రావణమాసంలో చేసే జన్మాష్టమి ఉపాసన చాలా అద్భుతమైన ఫలితాలనిస్తుంది. *జన్మాష్టమి గొప్పదనం* భక్తులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని పునరుద్ధరించడానికి పరమాత్మ అవతారం స్వీకరిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అంశావతారాలుగా, కొన్నిసార్లు ఆవేశావతారాలుగా, కొన్నిసార్లు పూర్ణావతారాలుగా వస్తే ఒక్క కృష్ణావతారం మాత్రం పరిపూర్ణ అవతారంగా వచ్చారు. అంటే రాశీభూతమైన పరబ్రహ్మము ఏదీ ఉందో, ఎవరు సాకారరూపమై సమస్తబ్రహ్మాండాలను హేలగా సృష్ఠి, స్థితి, లయములను చేస్తున్నాడో, అట్టి పరాత్పరుడు పరిపూర్ణమైన స్వస్వరూపంతో ఈ భూమిమీద పాదం మోపిన తిధిని జన్మాష్టమి అంటారు. మిగతా పర్వదినాలన్నీ ఒక ఎత్తైతే, జన్మాష్టమి పర్వదినం ప్రత్యేకంగా ఉంటుంది. “కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినష్యతి”, కోటి జన్మలలో చేసిన పాపములు సైతం నశిస్తాయి ప్రతిరోజు కృష్ణపరమాత్మని స్మరించడం వలన అని కృష్ణాష్టక ఫలస్తుతి చెప్తుంది. ఈ 8 రోజులు ఏం చెయ్యాలి? జన్మాష్టమి ఉపాసన చాలా తేలికగా, సులభంగా ఉంటుంది. సూర్యోదయం పూర్వం నిద్రలేచి, పూజామందిరంలో శ్రీకృష్ణ పరమాత్మ మూర్తి(విగ్రహం) లేదా పటం లేదా ఫోటో ఫ్రేమునుగానీ కృష్ణస్వరూపంగా భావన చేసి ధూప, దీప, నైవేద్య, చందన, పుష్పాలతో షోడశోపచార పూజ కానీ, పంచోపచార పూజ కానీ లేదా మీకు తెలిసినంతలో శక్తికొలదీ ప్రతిరోజూ పూజించండి. ఈ 8 రోజులు దీక్షాలాగా భావించి మాంసం, మందు, అసత్యం మానేయ్యండి. వీలయితే బ్రహ్మచర్యాన్ని పాటించండి. జప, తప, దానాదులు చాలా గొప్ప ఫలితాన్నిస్తుంది. ప్రతిరోజూ శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి కానీ, కృష్ణాష్టకం కానీ, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చెయ్యండి. భక్తులు భగవత సప్తాహం చేస్తుంటారు, అంటే మొదటి 7 రోజులు భాగవతాన్ని పారాయణం చేస్తుంటారు లేదా వినటం కూడా మంచిదే. 8వ రోజు శ్రీకృష్ణ పరమాత్మ కళ్యాణంలో నిర్వహిస్తుంటారు లేదా పాల్గొంటారు. ఈ 8రోజులు అష్టాక్షరీ లేదా ద్వాదశాక్షరీ మహామంత్రాన్ని కానీ జపించడం అద్భుతమైన ఫలితాన్నిస్తుంది. మంత్రోపదేశం పొందనివాళ్ళు హరేకృష్ణ-హరేరామ మహానామాన్ని మనసులో జపించడం చాలా ఉత్తమం. పనిలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా మనసులో కృష్ణ నామాన్ని స్మరించుకుంటూ ఉండటం మంచిది చాతుర్వర్ణాలవారు కూడా ఈ 8 రోజులు దీక్ష పాటించవచ్చు. యోగులు, సిద్ధపురుషులు కూడా దీక్షను పాటిస్తారు. ఈ 8రోజులు వైష్ణవాలయాలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. *శ్రీకృష్ణ చరణం శరణం మమ*