త్వరలోనే మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాంలతోపాటు రాజస్థాన్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు రాబోతున్నాయి. పెద్ద రాష్ట్రం మధ్యప్రదేశ్ లో శివ్ రాజ్ సింగ్ పాపులారిటీతో గట్టెక్కిపోతామన్న ధీమా బీజేపీ అధినాయకత్వంలో కొంత ఉంది. ఛత్తీస్ గఢ్ విషయంలో కూడా చివరి నిమిషంలోనైనా ఏదో ఒక మ్యాజిక్ చెయ్యగలం అనే నమ్మకం ఉంది కానీ, రాజస్థాన్ విషయంలోనే భాజపా అధినాయకత్వానికి తీవ్ర గందరగోళ పరిస్థితుల్లో పడిందని తెలుస్తోంది. ఆ రాష్ట్రంలో మరోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా వసుంధరా రాజే ఉండబోతున్నారు. ప్రస్తుతం ఆమె రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తున్నారు. అయితే, ఈ యాత్రకు ప్రజల నుంచి స్పందన సరిగా ఉండటం లేదట! అంతేకాదు, ఆమె ఖరీదైన లగ్జరీ బస్సులో టూర్ చేస్తుండటం కూడా విమర్శలకు దారితీస్తోందని సమాచారం. సర్వేలో దిమ్మదిరిగే ఫలితాలు వచ్చాయనీ, రాష్ట్రంలో ఏకంగా 96 నియోజక వర్గాల్లోని సిట్టింగులకు డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదని తేలిందని సమాచారం. ఈ సర్వే ఫలితాలు ఢిల్లీ భాజపా కేంద్ర కార్యాలయానికి చేరాయనీ, దీనిపై ప్రధాని మోడీగానీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కూడా తెలియనట్టుగానే వ్యవహరిస్తున్నట్టు సమాచారం. బీజేపీ అగ్రనేతలు కూడా ఈ సర్వేపై మాట్లాడే పరిస్థితి లేదంటున్నారు. అది బీజేపీ చేయించుకున్న సర్వే కాబట్టి, ఫలితాలపై వారు మాట్లాడలేకపోతున్నట్టు చెబుతున్నారు. అయితే, సదరు సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఆ 96 మందినీ తప్పించే పరిస్థితిలో నాయకత్వం లేదు! ఎందుకంటే, వారికి టిక్కెట్లు ఇవ్వమని ఉన్నపళంగా చెబితే.. వారంతా రెబెల్స్ మారే అవకాశం ఉంది.ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలోనూ మోడీ షా ద్వయానికి ఇదే సమస్య.. వసుంధరా రాజేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందనీ తెలుసు… అశోక్ గెహ్లాట్ కు ధీటుగా ఈసారి ఆమె నాయకత్వంలో పార్టీ నడవడం కష్ట సాధ్యమనీ తెలుసు! అయినాసరే… వసుంధర అభ్యర్థిత్వాన్ని మార్చలేని పరిస్థితి..! వసుంధరను తప్పిస్తే, ఆమె ఎదురు తిరిగేందుకు సిద్ధంగా ఉన్నట్టు గతంలోనే చాలా స్పష్టంగా చెప్పేశారు..! ఎన్నికలు దగ్గరపడుతూ ఉన్న నేపథ్యంలో రాజస్థాన్ విషయమై ఏం చెయ్యాలనేది భాజపాకి సవాలు మారుతోందని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. ప్రస్తుతానికి మోడీ షా ద్వయానికి కూడా ఇదే టెన్షననీ.. రాజస్థాన్ విషయమై వస్తున్న సర్వేలు జాతీయ స్థాయిలో చర్చనీయం కాకుండా ఉండేందుకే.. వాటి గురించి జాతీయ నాయకులెవ్వరూ మాట్లాడటం లేదని తెలుస్తోంది.