మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి మరణం ఇప్పుడు కొత్త వివాద అంశంగా తెరపైకి వచ్చింది. ఆయన మరణం ఆగస్టు 16నే చోటు చేసుకుందా? అంటూ కొత్త అనుమానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు బీజేపీ మిత్రపక్షం శివసేన. గడిచిన కొద్దికాలంగా ఈ ఇరువురు మిత్రుల మధ్య సహృద్బావ వాతావరణం లేని పరిస్థితి. ఇలాంటి వేళ.. తాజాగా మాజీ ప్రధాని వాజ్ పేయి మరణంపై శివసేన రాజ్యసభ ఎంపీ.. సామ్నా పత్రిక ఎడిటర్ సంజయ్ రౌత్ కొత్త అనుమానాన్ని వ్యక్తం చేశారు.తాజాగా శివసేన అధికారిక పత్రిక సామ్నా సంపాదకీయంలో వాజ్ పేయి మరణాన్ని ప్రకటించిన తేదీపై కొత్త సందేహాల్ని వ్యక్తం చేశారు. ఆగస్టు 12-13 తేదీల్లో అటల్ జీ ఆరోగ్యం తీవ్రంగా విషమిస్తోందని.. ఉత్సాహంగా జరగాల్సిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆయన మరణంతో జరపలేని పరిస్థితి ఉండటంతో ఆగస్టు 16న ఆయన మరణాన్ని డిక్లేర్ చేశారా? అన్న సందేహాన్ని వ్యక్తం చేయటం గమనార్హం.ఎర్రకోట మీద సుదీర్ఘమైన మోడీ ప్రసంగానికి అడ్డంకులు లేకుండా ఉండేందుకే ఆగస్టు 16న మరణించినట్లు ప్రకటించారా? అంటూ కొత్త సందేహాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. మన నేతలు స్వరాజ్యం గురించి సరిగా అర్థం చేసుకోవాలని.. స్వరాజ్యం అంటే ఏమిటి? అన్న శీర్షిక మీద ఈ సంచలన ఎడిటోరియల్ ను ఆయన ప్రస్తావించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే అటల్ జీ మరణ తేదీని తప్పుగా చెప్పి ఉంటేమాత్రం.. అదో సంచలనంగా మారటం ఖాయం. ఇలాంటి విమర్శ మరెవరోచేసి ఉంటే అదో పద్ధతి. బీజేపీ మిత్రపక్షమే ఇంతటి తీవ్ర ఆరోపణ చేయటం అందరిని ఉలిక్కిపడేలా చేస్తోంది.