పల్లె పడకేసింది.. పట్టణం ప్రాణాలు బిగబట్టిచూస్తోంది.. పేదలు కాలానుగుణ వ్యాధులతో వణికిపోతున్నారు. నిరుపేదలు జ్వరాలతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. విషజ్వరాలు ప్రబలుతున్నాయి. మలేరియా మానసికంగా, శారీరకంగా కుంగదీస్తోంది. ఇదే సందర్భంలో డెంగీ, టైఫాయిడ్, గన్యా ముప్పుతో జిల్లాలో ప్రజారోగ్యం కకావికలమవుతోంది.. కాలానుగుణ మార్పులు, వ్యాధులపై అవగాహన కల్పించాల్సిన వైద్యారోగ్యశాఖ ఆర్భాటపు ప్రచారానికే పరిమితమవుతోంది. పారిశుద్ధ్య నిర్వహణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సిన పంచాయతీ అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. ఫలితంగా ప్రస్తుతం కురుస్తున్న అరకొర వర్షాలతో పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది.
జిల్లావ్యాప్తంగా గత నెలరోజులుగా జ్వర పీడితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మలేరియా బాధితులు కడప రిమ్స్‌కు భారీగా క్యూ కట్టినట్లు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికీ అదే సమస్య కొనసాగుతోంది. ప్రస్తుతం విషజ్వరాలు ప్రబలుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. ప్రస్తుతానికి మలేరియా, విష, సాధారణ జ్వరాలతో రోగులు భారీగా ఆస్పత్రులను చేరుతున్నారు. మున్ముందు డెంగీ, గన్యా, టైఫాయిడ్ ముప్పు పొంచి ఉందని అనేకులు హెచ్చరిస్తున్నారు.
జిల్లాలో ఏటా జ్వరాలు తీవ్రస్థాయిలో జనాన్ని ఇబ్బంది పెడతున్నాయి. ఎక్కడికక్కడ ఆ మూడు జ్వరాలు ప్రజలను శారీరకంగా కుంగదీస్తున్నాయి. గతేడాది అధికారుల లెక్కల ప్రకారమే. 240 మలేరియా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది కూడా ఈ లెక్క దాటి 300 వరకు నమోదయ్యాయి. ఇక్కడ 700 నుంచి వెయ్యి కేసుల వరకు నమోదైతే అధికారులు సగానికి సగం తగ్గించి చూపించారన్న విమర్శలు అప్పట్లో వినిపించాయి. ఏటా ఇదే రీతిలో రెట్టింపుస్థాయిలో జనం వివిధ రకాల జ్వరాలతో ఇబ్బంది పడుతున్నా అధికారులు మాత్రం ఆ స్థాయిలో సమస్య లేదంటూ తప్పుడు నివేదికలతో సరిపుచ్చేస్తుండటం గమనార్హం. గతేడాది చాలా ఊళ్లలో ఇంటింటా జ్వర పీడితులు కనిపించినా డెంగీ, టైఫాయిడ్ కేసులే ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ సాధారణ జ్వరాలేనంటూ కొట్టిపారేసిన ఉదంతాలున్నాయి. ఒకదశలో వైద్యఆరోగ్యశాఖ వర్గాలు చేతులెత్తేయడం.. దానిపై అప్పటి కలెక్టర్ బాహాటంగానే సీరియస్ అయ్యారు. ఇప్పుడూ అదే రీతిలో వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటం సమస్యగా మారింది.
ప్రస్తుతం జ్వరాల బారిన పడిన రోగులకు చికిత్స అందించడంలోనే సమస్య ఏర్పడుతోంది. స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్సకు వెళితే మొక్కుబడిగానే సేవలందిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని చోట్ల పారాసిటమాల్ ఇచ్చి పంపేస్తున్నారు. మరికొన్నిచోట్ల వాటికీ కొరత ఉన్నట్లు చెబుతున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అయితే సంగతి సరేసరి. స్థానికంగా వచ్చిన వారికి మెరుగైన వైద్యం తీసుకోవాలంటూ రిమ్స్‌కు రెఫర్ చేసేస్తున్నారు. స్థానికంగా చికిత్స అందించడానికి వెనుకాడుతుండటంతో సమస్య తప్పకుంది. దీంతో చేసేదేమీలేక ఎక్కువమంది స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ రక్త, మూత్ర పరీక్షల పేరుతో భారీగా ఖర్చుపెట్టిస్తున్నారు. ఆపై రిమ్స్‌కు రెఫర్ చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే జిల్లాలో ప్రస్తుతం రిమ్స్‌లో మాత్రమే కొంతమేర మెరుగైన వైద్యం జ్వర పీడితులకు అందుతోంది. ఆలోపే జ్వరపీడితులు వేలకు వేలు నష్టపోయి ఇక్కడికి వస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు సమస్యపై స్పందించి అన్ని చోట్లా మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. వైద్యారోగ్యశాఖ కాకిలెక్కలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.