YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం.. బాలకాండ మందర మకరందం

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం.. బాలకాండ మందర మకరందం

                                           సర్గ- 20

                        దశరథుడిపై కోపించిన విశ్వామిత్రుడు
                       శ్రీరాముడిని పంపమని దశరథుడికి బోధించిన వశిష్ఠుడు

 తానేది అడిగితే ఏదైనాఇస్తానన్నదశరథుడికి అసత్యభీతిలేకుండా-ఎదుటివాడి పరువు పోతుందనుకోక-మరొకరికి తెలిసినంత మాత్రమైనా తెలియక–ఆలోచనలేక-విశ్వామిత్రుడంతటి మహాత్ముడొచ్చి అడిగాడేనని కూడాఆలోచించక-ఒకడుచెప్పినా అర్థంచేసుకొనేతెలివితేటలులేక-కేవలం పామరత్వంతోమాట్లాడిన మాటలనువిన్న విశ్వామిత్రుడు,ఈ మూఢుడిక మంచిమాటలతో చక్కబడడనుకొని,కోపం తెచ్చుకొని, కనుబొమల్ని చూసేవారందరికీ భయంపుట్టేవిధంగా భయంకరంగా ముడిచి, ప్రళయకాల రుద్రుడిలాగా భయంకరుడై, ఎండినకట్టెలను దహిస్తూ-మండుటెండలో నేయివేస్తే ధగ్గుమని విజృంభించే అగ్నిలాగా, అసలే స్వభావరీత్యా కోపిష్ఠైనందున, దశరథుడిని ఏంచేయబోతున్నాడోననేవిధంగా,దేవతా సమూహాలు భయపడుతుంటే-భూమి గడగడలాడుతుంటే రాజుతో అంటాదీవిధంగా:
"ఓరీ! రఘువంశానికి అపకీర్తి తెచ్చేందుకు పుట్టిన నీచుడా! లోకంలో ఎవరికీ కొడుకులు లేరా? నీవొక్కడివేనా కొడుకులను కన్నావు? నేనేది కోరినా సంపూర్ణంగా నెరవేరుస్తానని మాటఇచ్చి,నేను నోరుజారి అడిగింతర్వాత, అహంకారంతో ఇవ్వనంటావా? నీకింతగర్వమా? నువ్వు నీకొడుకును పంపనంతమాత్రాన నా కార్యం ఆగిపోతుందనుకుంటున్నావా?చూద్దాం-ఎలాజరుగదో!దశరథా!నీలాంటి స్వతఃజ్ఞానంలేనివాడిని,చెప్పినా అర్థంచేసుకోలేనివాడిని,పట్టినపట్టు సాధించాలనుకునేవాడిని,విషయాసక్తుడిని,అసత్యవాదిని, మోసగాడినైన నిన్ను దేశానికి ప్రభువుగా, శ్రీరాముడంతటివానికి తండ్రిగా చేసిన బ్రహ్మదేవుడిని పట్టుకొని తునాతునకలుగా ఖండించాలి గాని నిన్నని ప్రయోజనంలేదు.హరిశ్చంద్రుడు ఆడితప్పేవాడుకాదని నాకనుభవమైనందున-ఆయనవంశంలో పుట్టిన నీవుకూడా అట్లానే సత్యసంధుడవన్న భ్రమతో-నిండు కోరికతో నిన్ను యాచించాను. రాజా నాతప్పు క్షమించు.ఇచ్చినమాటతప్పడం నీకు ధర్మమనకుంటే,వచ్చినదారినే వెళ్తాను. అసత్యవాదివిగా సకలబంధువులతో సుఖంగావుండు".ఇలా ఎప్పుడైతే విశ్వామిత్రుడు తన చెక్కిళ్ళు అదురుతుండగా, చూసేవారు గడగడలాడుతుండగా,రెండు కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ, విజృంభించి పలుకుతుంటే, దేవతలు నివ్వెర పడుతుంటే, దశరథుడితో శ్రీరాముడిని విశ్వామిత్రుడితో పంపమని నచ్చచెప్తాడు వశిష్ఠుడు.
"రాజేంద్రా! విశ్వామిత్రుడితో నువ్వు తొందరపడి, ఆయనేదికోరినా ఇస్తానన్నావు. ఆతర్వాతనే ఆయన తనకోరికను బయటపెట్టాడు.చెప్పిన తర్వాత నువ్వు ఆడినమాట తప్పడం న్యాయమా? మహాత్ములు ఒకరిని యాచించడమే నీచంగా భావిస్తారు.అలాంటప్పుడు,నీ మాటమీద,చేయిజాచి అవలక్షణంలాగా నోరుజారి యాచించి, చివరకు లేదుపొమ్మనిపించుకోవడం కంటే అవమానం ఇంకొకటిలేదుకదా! నువ్వు విశ్వామిత్రుడిని సామాన్య బిచ్చగాడిగా అనుకుంటున్నావు-అలానే చూస్తున్నావు.నువ్వు పుట్టిందేమో కకుత్థ్సవంశంలో-పూనిందేమో సత్యవ్రతం-పేరేమో ధర్మాత్ముడన్న ప్రసిద్ధి.ఇలాంటి నువ్వు అబద్ధమాడవచ్చా?నీకు తప్పొప్పులాలోచించే బుద్ధిబలముంది.ఎలాంటి కష్టాల్లోనూ చలించని ధైర్యంగలవాడివి.వ్రతభంగం లేకుండా, సాంతంగాసాధించగల హితబుద్ధిగలవాడివి.సత్యవ్రతుడని నిర్మలమైన కీర్తిగడించావు.ముల్లోకాల్లోనూ ధర్మాత్ముడన్నపేరుతెచ్చుకున్నావు.ఇలాంటివాడుధర్మంతప్పిమాట్లాడవచ్చా?ధర్మాత్ముడా!అన్ని లోకాల్లోనూ దశరథమహారాజు మిక్కిలిధర్మాత్ముడన్న కీర్తిసంపాదించి, ఇప్పుడుస్వధర్మాన్ని విడిచిపెట్టవచ్చా?"
"రాజేంద్రా! ఏం కోరినా చేస్తానని అన్నావు. కోరిక చెప్పింతర్వాత చేయనని అనవచ్చా? చేస్తానని ముందు చెప్పి, తర్వాత మాటతప్పి, చేయకపోతే, యాగాలను-బావులను-గుంటలను-తోపులను-ధర్మ కార్యాలను చెరిస్తే కలిగే పాపమే కలుగుతుంది. అందుచేత, శ్రీరామచంద్రుడిని విశ్వామిత్రుడివెంట పంపడమే నీకు మేలైన కార్యం. అస్త్రవంతుడైనా-కాకున్నా, దివ్యామృతాన్ని రక్షించే అగ్నిలాగా, విశ్వామిత్రుడి రక్షణలో వున్న రాముడిని ఎంతటి బలవంతులైనా-రాక్షసులైనా ఏం చేయలేరు. కాబట్టి శ్రీరాముడికి ఏ అపాయం జరుగుతుందన్న భయం లేదు. భయకారణమూలేదు. విశ్వామిత్రుడంటే అందరిలాంటి మునీశ్వరుడు కానేకాదు.విశ్వామిత్రుడంటే నువ్వేమనుకుంటున్నావో?మనుష్యరూపం ధరించిన ధర్మం-పరాక్రమవంతులలో శ్రేష్ఠుడు-బుద్ధిబలంతో కొత్త కొత్త గొప్ప కార్యాలను చేయగల సమర్థుడు-మంచి వ్రతాలకు స్థానం-లోకంలో జంగమ స్థావరాల సమూహాలకు తెలియని అస్త్రాలు ఈయన వశంలో వుంటాయి-అసమానుడు. దేవతలకు, కిన్నరులకు, కింపురుషులకు, అసురులకు, గంధర్వులకు, పన్నగులకు, గరుడులకు - వీరందరిలో శూరులనిపించుకున్నవారికైనా, ఇవి ఇలాంటివని పరీక్షించి తెలుసుకోడానికి సాధ్యపడని మహాస్త్రాలు ఈయన వశంలో వున్నాయి" అని దశరథుడితో అంటూ, శ్రీరామ మహాత్మ్యం చెప్పినా తెలుసుకోలేని అతడిని చూసి, ఇంకా నమ్మకం కలిగేలా విశ్వామిత్రుడి అస్త్ర సంపత్తిని గురించి ఇలా చెప్పసాగాడు వశిష్ఠుడు.
"పూర్వం భృశాశ్వుడనే ఒక ప్రజాపతి వుండేవాడు. ఆయన దక్షుడి ఇద్దరు (జయ-సుప్రభ) కూతుళ్లను పెళ్ళి చేసుకున్నాడు. జయవల్ల కోరిన రూపం ధరించగల పరాక్రమవంతులైన ఏభై మందిని-సుప్రభవల్ల సంహారులనే అజేయ బలవంతులు,అసమానశక్తివంతులైన ఏభైమందిని కన్నాడు.వాళ్ళందరూ అస్త్రాలయ్యారు. వాటన్నింటినీ, భృశాశ్వుడు ద్వారానే-ఆయన రాజ్యం చేస్తున్న రోజుల్లోనే, తన తపోబలంతో సంపాదించాడు విశ్వామిత్రుడు.ఈవిషయంలో నీకు సందేహమక్కరలేదు. అవేకాదు. శివుడితో సమానమైన విశ్వామిత్రుడు, ఎన్నో అస్త్రాలను కొత్తకొత్తగా సృష్టించగల శక్తికలవాడు. నీ కొడుకుకు అస్త్రాలు తెలియదన్న భయం వదలి ఈయనతో పంపు. ఆయనేదో తన కార్యాన్ని తాను చేసుకోలేక, రామచంద్రుడిని ఇమ్మని వేడుకునేందుకు వచ్చాడని అనుకోవద్దు. నీ కొడుకుకు మేలుకలిగించేందుకే ఆయనొచ్చాడు" అని దశరథుడికి ధైర్యం చెప్పాడు.

                                                             రేపు తరువాయి భాగం..

Related Posts