ప్రధాన రాజకీయ పార్టీల నుండి జనసేన పార్టీలోకి ఫిరాయింపుల జోరు పెరిగింది. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ ఫిరాయింపులపై పెదవి విరుస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవలి కాలంలో జనసేనలో చేరుతున్న నేతలను చూస్తే కాపు సామాజికవర్గం నుండే వలసలు అధికంగా ఉంటున్నట్టు ఇతర సామాజికవర్గాల నేతలు విమర్శిస్తున్నారు. జనసేన పార్టీని పవన్‌కళ్యాణ్ ప్రారంభించిన కొత్తలో గోదావరి జిల్లాలకు చెందిన పలువురు కాపునేతలు జనసేనలో చేరేందుకు ముందుకువచ్చారు. జనసేనాని పవన్‌కళ్యాణ్ జిల్లాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో అదే సామాజికవర్గానికి చెందిన నేతలు ఆయా ప్రాంతాల్లో హవా సాగిస్తున్నారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి కంచుకోటగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ మొత్తం కాపునేతలతో నిండిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్‌కళ్యాణ్ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినపుడు కూడా ఇదే విధమైన విమర్శలను ఎదుర్కొన్నారు. అప్పట్లో పవన్‌కళ్యాణ్ యువరాజ్యం అధ్యక్షుడిగా వ్యవహరించారు.జనసేనాని పవన్‌కళ్యాణ్ పాల్గొనే బహిరంగ సభలు, సమావేశాల్లో తరచూ కుల ప్రస్తావన తీసుకువస్తుంటారు. తనకు అన్ని కులాలు ఒక్కటేనని, జనసేన కుల, మతాలకు అతీతంగా పనిచేస్తుందని స్పష్టం చేస్తున్నారు. వాస్తవంగా చూస్తే పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో పరిస్థితిని గమనిస్తే జనసేనకు సంబంధించి ఏ ఒక్క కార్యక్రమాన్ని పరిశీలించినా 90శాతం నేతలు కాపు సామాజికవర్గానికి చెందిన వారే ఉంటారని, వేదికలపై మరో సామాజికవర్గం నేతలు కానరావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.ఇటీవలి కాలంలో జనసేనలోకి వలసలను పరిశీలించినా ఇదే విషయం స్పష్టమవుతుందని పేర్కొంటున్నారు. వైకాపా, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుండి జనసేనలో చేరుతున్న నేతల్లోనూ అధికశాతం కాపు సామాజికవర్గ నేతలే కనిపిస్తుంన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలలో సుదీర్ఘకాలంగా సేవలందించి, ప్రస్తుతం ఆయా పార్టీల్లో ఇమడలేకపోతున్న ముఖ్య నేతలను జనసేన అధ్యక్షుడు కే.పవన్‌కళ్యాణ్ స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఇటీవల కాకినాడ నగరానికి చెందిన మాజీమంత్రి ముత్తా గోపాలకృష్ణ స్వయంగా పవన్ పార్టీలోకి ఆహ్వానించడంతో జనసేనలో చేరారు.వైసీపీకు చెందిన సంగిశెట్టి అశోక్, టీడీపీకి చెందిన కార్పొరేటర్ మాకినీడి శేషుకుమారి, కాంగ్రెస్ పార్టీ నుండి రెండు పర్యాయాలు సంపర ఎమ్మెల్యేగా పనిచేసిన అనిశెట్టి బుల్లబ్బాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) తదితరులు జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, తుని మాజీ ఎమ్మెల్యే అశోక్‌బాబు తదితరులు జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.రానున్న రోజుల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన మరికొందరు నేతలు జనసేనలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వైకాపా, కాంగ్రెస్ నుండి జనసేనలోకి ఫిరాయింపులున్నా, ఎన్నికలు దగ్గరపడే సమయానికి అధికార టీడీపీకి చెందిన స్థానిక నేతలు జనసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అయితే ఈ ఫిరాయింపులు ఏ ఒక్క సామాజికవర్గానికో పరిమితం కాకుండా, అన్ని కులాలకు చెందిన వారూ జనసేనలో చేరేలా చూడాల్సిన బాధ్యత పార్టీ అధిష్ఠానంపైనే ఉందని పలువురు హితవు పలుకుతున్నారు.