మంత్రి భూమా అఖిలప్రియకు వచ్చేసారి పెద్ద పరీక్షనే పెట్టబోతున్నాడట చంద్రబాబు నాయుడు. ఆమెకు ఆళ్లగడ్డ టికెట్‌ను నిరాకరిస్తూ.. ఆమెను మరోచోట నుంచి పోటీ చేయించనున్నారట. నంద్యాల ఎంపీగా అఖిలప్రియను పోటీ చేయించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆళ్లగడ్డ నుంచి కదలడానికి మంత్రి రెడీగా లేకపోయినా.. పార్టీతో ఉండాలనుకుంటే నంద్యాల ఎంపీగా పోటీ చేయాల్సిందేనని అఖిలకు చంద్రబాబు నాయుడు సంకేతాలు పంపినట్టుగా వార్తలు వస్తున్నాయి.అఖిలప్రియ తీరుపై చంద్రబాబుకు చాలా అసహనమే ఉంది. అయితే నంద్యాల బైపోల్‌లో విజయం కోసం ఆమెకు మంత్రి పదవిని ఇచ్చాడు. సానుభూతిని క్యాష్ చేసుకున్నాడు. ఇకపై భూమా కుటుంబానికి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యతను చాలా తగ్గించబోతున్నాడు. భూమా బ్రహ్మానందరెడ్డికి నంద్యాల ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరనే మాట మొదటి నుంచి వినిపిస్తోంది. సానుభూతి కోసం ఏదో ఒకసారి ఛాన్స్ ఇచ్చారు. ఇక ఆళ్లగడ్డలో కూడా అఖిలప్రియకు, ఏవీ సుబ్బారెడ్డికి మధ్యన రచ్చ రేగుతున్న సంగతి తెలిసిందే.చంద్రబాబు నాయుడు ఏవీ సుబ్బారెడ్డి వైపు మొగ్గుచూపుతున్నాడని... ఆళ్లగడ్డ టికెట్ ఏవీకే ఖరారు చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక అఖిలప్రియకు పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా నంద్యాల ఎంపీ టికెట్ ఇస్తామని చెబుతున్నట్టుగా సమాచారం. నంద్యాల ఎంపీగా నెగ్గుకురావడం అంటే మాటలుకాదు. అది కూడా నంద్యాల ఎంపీ సీటు తెలుగుదేశం పార్టీకి మరీ అనుకూలమైనది ఏమీకాదు.ఇక్కడ నుంచి భూమా నాగిరెడ్డే నెగ్గుకురాలేకపోయాడు. ఏడు సెగ్మెంట్ల పరిధిలో హవాను కొనసాగించలేకపోయాడు. అలాంటిది అఖిలప్రియకు ఆ బాధ్యతలు ఇస్తే ఆమె తీసుకుంటుందా? లేక జనసేన వైపు చేరిపోతుందా? చంద్రబాబు నాయుడు కోరినట్టుగా అవకాశం ఇవ్వని పక్షంలో అఖిలప్రియ తెలుగుదేశం పార్టీని వీడి జనసేన వైపుకు చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.గతంలో ప్రజారాజ్యం అనుభవం ఉంది భూమా కుటుంబానికి. సో.. అఖిల అటువైపు వెళ్లడం పెద్దకష్టం కాదేమో.