ఏపీ ప్రధాన విపక్షం వైసీపీకి అత్యంత గట్టి పట్టున్న జిల్లా నెల్లూరు. ఇక్కడ నుంచి ఎంపీ టికెట్ సహా పలు నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో ఈ పట్టును మరింత పెంచుకునేందుకు వైసీపీ అధినేత జగన్ పావులు కదుపుతుండగా.. ఇక్కడ నాయకులు మాత్రం బెంబేలెత్తుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. నిన్న మొన్నటి వరకు తమను విమర్శించిన నాయకులు ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకుని,ఇక్కడ నుంచి పోటీ చేయాలని నిర్ణయించు కోవడమేనని సమాచారం. విషయంలోకి వెళ్తే.. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి సెప్టెంబర్ 2వ తేదీన వైసీపీలో చేరనున్నారు. తెలుగుదేశం నుంచి నిష్క్రమించిన రామనారాయణరెడ్డి వైసీపీలో చేరడానికి నిశ్చయించుకున్న విషయం తెలిసిందే.ఈ నిర్ణయం తీసుకొని నెల రోజులు దాటుతున్నా మంచి రోజులు లేవనే ఉద్దేశంతో చేరిక తేదీని ఖరారు చేయలేదు. శ్రావణమాసం నడుస్తుండటంతో అధికారికంగా పార్టీలో చేరడానికి ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఆనం సన్నిహితులు, జిల్లా వైసీపీ నాయకుల సమాచారం మేరకు సెప్టెంబర్ 2వ తేదిన అధికారికంగా వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి ఆనం నిర్ణయించుకున్నట్లు తెలిసింది. విశాఖపట్నంలో పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో ఈయన వైసీపీలో చేరనున్నారు. అదే రోజు వైఎస్ వర్థంతి కావడంతో ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు విశాఖలో ఏర్పాటు చేసే వైఎస్ వర్థంతి కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. వీరందరి సమక్షంలో ఆనం వైసీపీలో చేరనున్నారు. ఈయనకు దాదాపు వెంకటగిరి టికెట్ ను ఇచ్చే అవకాశం లేదా.. నామినేటెడ్ పదవి ఖాయమనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఆనం లాంటి సీనియర్ నామినేటెడ్ పోస్టు తీసుకోరు. ఆయన అసెంబ్లీకే పోటీకి రెడీ అవుతున్నారని తెలుస్తోంది.అదే సమయంలో మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు.. నేదురుమల్లి రామ్ కుమార్ కూడా వచ్చే నెలలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. గత ఎన్నికల్లో వెంకటగిరి నుంచి పోటీ చేసిన రామ్ కుమార్ ఓడిపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో అయినా విజయం సాధించాలని భావిస్తున్నారు. ఈ పరిణామం వెంకటగిరి వైసీపీలో చిచ్చు పెడుతోంది. ఇప్ప టి వరకు తాము పార్టీకి అండగా ఉన్నామని, అయితే, తమతో కనీసం మాట కూడా చెప్పకుండానే వీరిద్దరినీ చేర్చుకోవడం ఏంటని స్థానిక వైసీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, మా జీవితాలు అందరికీ జై కొట్టుకుంటూ పోవడమేనా? అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక ఆనం, రామ్‌కుమార్‌ను చేర్చుకోవడంతో వీరిద్దరి పేరు వెంకటగిరి టిక్కెట్ రేసులోనే వినిపిస్తోంది. అసలు వీరిద్దరిలో ఎవరికి వెంకటగిరి టిక్కెట్ వస్తుందో తెలియని పరిస్థితి. ఈ క్రమంలోనే ఇక్కడ వైసీపీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరి నేతల అసంతృప్తికి జగన్ ఎలా చెక్ పెడతారో చూడాలి.