YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పద్మావతి భక్తులకు నిరాశే

పద్మావతి భక్తులకు నిరాశే
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఏకాంతసేవలో పాల్గొనాలనుకునే భక్తులకు నిరంతరం నిరాశే ఎదురవుతోంది. ఆలయంలో పనిచేసే అధికారులు, విజిలెన్స్ అధికారులు భక్తులకు టికెట్లు అందకుండా తమకు కావాల్సిన వారికి ముందుగానే కౌంటర్లో ఉన్నవారి నుంచి పొందుతున్నట్లు విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి.  అమ్మవారి ఏకాంత సేవలో పాల్గొనేందుకు భక్తులు టికెట్లు విక్రయించే కౌంటర్ వద్ద బారులు తీరారు.
కొంత సేపటికి టికెట్లు అయిపోయాయని కౌంటర్‌లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది భక్తులకు తెలిపారు. దీంతో ఆగ్రహించిన భక్తులు మీరు దాచిన టికెట్లు బయటకు తీయాలని డిమాండ్ చేశారు. దీంతో వారు తటపటాయించడంతో వారి వద్ద ఉన్న 12 టికెట్లను స్వాధీనం చేసుకుని తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న పురుషోత్తం, శివకుమార్ ముందుగా టికెట్లు పొంది వాటిని బ్లాక్‌లో విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే తామెలాంటి తప్పు చేయలేదని సూపరింటెండెంట్ ఈశ్వరయ్య ఎనిమిది టికెట్లు అడిగారని, ఆర్జితం ఇన్స్‌పెక్టర్ రెండు టికెట్లు, సీవీఎస్వోకు సంబంధించిన వారికి రెండు టికెట్లు ముందుగా తీసి ఉంచామని తెలిపారు. ఈ విషయాన్ని రాత పూర్వకంగా తెలియజేశారు.వాస్తవానికి ప్రతిరోజూ అమ్మవారి ఏకాంత సేవ సమయంలో ఆలయంలోపల ఉన్న స్థలాభావాన్ని దృష్టిలో ఉంచుకుని 75 టికెట్లు భక్తులకు విక్రయిస్తారు. ఒక్కో టికెట్టు రూ.100, రూ. 200 చొప్పున టికెట్లు విక్రయిస్తారు. ప్రతి రోజు 15 నుంచి 20 టికెట్లు అధికారులు ఇలా ముందుగా రిజర్వ్ చేసుకుంటారని, కౌంటర్ మూసి వేసిన తరువాత, భక్తులు వెళ్లిపోయిన అనంతరం ఆ టికెట్లను తీసుకు వెడతారని పురుషోత్తం, శివకుమార్ పోలీసులకు రాతపూర్వకంగా తెలిపారు. అయితే ఆలయ అధికారులు మాత్రం వారు బ్లాక్‌లో విక్రయించడానికి ప్రయత్నించి ఆ నెపాన్ని తమపై నెట్టడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.

Related Posts