YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో ఫెడరల్ బ్యాంకు

విశాఖలో ఫెడరల్ బ్యాంకు
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో తొమ్మిదేళ్లు సీఎం పని చేసిన సమయంలోనే దీనికి బీజం వేశారు. సిరిపురం జంక్షన్ లో గల హెచ్ఎస్బీసీని ఆయనే తీసుకువచ్చారు. ప్రస్తుతం వేయి మందికి పైగా అందులో పనిచేస్తున్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఐటీ పార్కులో ఫిన్ టెక్ వ్యాలీని ఏర్పాటు చేశారు. వీసా మాస్టర్ కార్డు, పేటీఎం వంటి సంస్థల్ని రప్పించారు. విశాఖను నగదు రహిత లావాదేవీల నగరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖకు ఫెడరల్ బ్యాంక్ ను తీసుకువస్తున్నారు. ఈ బ్యాంకు విశాఖలో బ్యాక్ ఆఫీసు ఏర్పాటుచేసి 500 మందికి ఉపాధి కల్పించనుంది. ఇటీవల విజయవాడలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయానంద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఫెడరల్ బ్యాంకుకు విశాఖపట్నంలో డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్కు(డీటీపీ) పాలసీ కింద ఓ భవనం కేటాయించాలని నిర్ణయించారు. దీంతో ఫెడరల్ బ్యాంకు ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటుందని ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) కార్యదర్శి కొసరాజు శ్రీధర్ తెలిపారు. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి ఇందులో ఉద్యోగ అవకాశాలు ఇస్తారన్నారు. నెలకు రూ.20 వేల వరకు వేతనం లభిస్తుందన్నారు. రెండు నెలల్లో దీనికి సంబంధించిన పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. వివిధ కార్యకలాపాల కోసం బ్యాంకులు ఐటీ రంగ పరిజ్ఞానాన్ని భారీగా వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేసు కుంటుంటాయి. ఇవి 24 గంటలూ పని చేస్తాయి. ఇలాంటి కేంద్రాన్నే విశాఖలో ఏర్పాటు చేస్తున్నారు. తొలుత ఒక ప్రైవేటు భవనంలో కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. ఆ తరువాత ప్రభుత్వ కేటాయింపులకు అనుగుణంగా ఆ సంస్థ శాశ్వత భవనాన్ని సమకూర్చుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ సంస్థలు, ఐటీ కార్యకలాపాల కోసం బయట సంస్థల సేవలను వినియోగించుకుంటుండేవి. ఇటీవల కాలంలో సొంతంగానే ఐటీ విభాగాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. వీటిని 'బ్యాక్ ఆఫీస్'గా పిలుస్తుంటారు. ఈ క్రమంలోనే ఫెడరల్ బ్యాంకు కూడా బ్యాక్ ఆఫీసను విశాఖలో ఏర్పాటు చేస్తోంది. కేరళకు చెందిన ఫెడరల్ బ్యాంకు 1250కు పైగా బ్రాంచీలతో 81 లక్షల మందికి పైగా ఖాతాదారులతో రూ. వేల కోట్ల లావాదేవీలను నిర్వహిస్తోంది.

Related Posts