ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో విరసం నేత వరవరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను నేరుగా పూణెకు తరలించనున్నారు. ఈ ఉదయం నుంచి హైదరాబాదులోని వరవరరావు నివాసంలో పూణె పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆయన నివాసంలో ఉన్న ప్రతి పేపర్ ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అంతేకాదు, విచారణ, సోదాలను పూర్తి స్థాయిలో వీడియో తీశారు.వరవరరావును అదుపులోకి తీసుకుంటున్నట్టు కాసేపటి క్రితమే ఆయన కుటుంబసభ్యులకు పోలీసులు తెలిపారు. కాసేపట్లో ఆయనను ఆయన నివాసం నుంచి బయటకు తీసుకురానున్నారు. వరవరరావును తీసుకెళ్లేందుకు ఇప్పటికే ఓ పోలీసు వాహనం అపార్ట్ మెంట్ లోని సెల్లార్ లోకి వెళ్లింది. కాసేపట్లో ఈ విషయం గురించి పోలీసు అధికారులు మీడియాతో అధికారికంగా మాట్లాడే అవకాశం ఉంది. అయితే, వరవరరావును నేరుగా పూణెకు తీసుకెళ్తారా? లేదా హైదరాబాదులో కోర్టులో ప్రవేశపెట్టి ఆ తర్వాత పూణెకు తరలిస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది. వరవరరావు నివాసం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టుల కుట్ర కేసులో విప్లవ రచయితల సంఘం(విరసం) నేత వరవరరావును అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మోదీని రాజీవ్ గాంధీ తరహాలో హత్య చేసేందుకు మావోయిస్టులు పన్నిన కుట్రలో వరవరరావు పాత్ర కూడా ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఆపరేషన్ కు వరవరరావు నిధులు సమకూర్చినట్లు వెల్లడించారు. మహారాష్ట్రలోని మావో సానుభూతిపరుడు రొనాల్డ్ విల్సన్ వద్ద లభ్యమైన లేఖలో వరవరరావు పేరు ఉండటంతో అప్పట్లో అధికారులు కేసు నమోదు చేశారు.గత మూడు నెలల పాటు ఈ లేఖల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిన పోలీసులు.. ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్ లోని వరవరరావు, ఆయన కుమార్తె ఇంటితో పాటు, ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ, జర్నలిస్ట్ కూర్మనాథ్, క్రాంతి టేకులతో పాటు మరో ఇద్దరి ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్యచేసిన తరహాలో నరేంద్ర మోదీని మట్టుబెట్టాలని మావోయిస్టులు కుట్ర పన్నినట్లు ఉన్న లేఖలను పుణె పోలీసులు 3 నెలల క్రితం విల్సన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు.డబ్బు కావాలంటే వరవరరావు సమకూరుస్తారని ఆ లేఖల్లో ఉంది. ఈ నేపథ్యంలో వరవరరావును అరెస్ట్ చేసి పుణెకు తీసుకెళ్లే అవకాశముందని భావిస్తున్నారు. ఒకవేళ విచారణ కోసం ఆయన్ను పుణెకు తరలించాలనుకుంటే స్థానిక కోర్టులో హాజరుపరచి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు వరవరరావు ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించడంపై ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి.అనునిత్యం మన ముందు కనపడే విరసం నేత వరవరరావు ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారనడం దారుణమని మహిళా నేత సంధ్య మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ కుట్ర అని అన్నారు. ప్రధాని మోదీ హత్యకు కుట్ర జరుగుతోందనే వార్తలను గతంలోనే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి, ప్రజాసంఘాలన్నీ ఖండించాయని గుర్తు చేశారు. మోదీ హత్యకు కావాల్సిన ఫండింగ్ ను వరవరరావు చేస్తున్నారనే ఆరోపణలు చాలా దారుణమని అన్నారు.వరవరరావును అరెస్ట్ చేయబోతున్నారన్న వార్తల నేపథ్యంలో, ప్రజాసంఘాల నేతలంతా ఒక్కొక్కరుగా ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా సంధ్య మాట్లాడుతూ, ప్రజా ఉద్యమాలకు మౌత్ పీస్ గా ఉన్న వరవరరావుపై జరుగుతున్న దాడిని తాము ముక్తకంఠంతో ఖండిస్తున్నామని చెప్పారు. వైట్ కాలర్ మేధావులను అణగదొక్కే ప్రయత్నం ప్రస్తుతం మన దేశంలో జరుగుతోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క గొంతుక కూడా వినిపించకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బషీర్ బాగ్ విద్యుత్ పోరాటం కాల్పుల్లో మరణించిన అమరవీరులకు నివాళి అర్పించేందుకు తాము వెళ్లామని, ఉదయం నుంచి తాము టీవీలో వార్తలు కూడా చూడలేదని, వరవరరావు ఇంట్లో సోదాలు జరుగుతున్నట్టు తమకు మధ్యలో సమాచారం అందిందని తెలిపారు. వెంటనే తాము ఇక్కడకు వచ్చామని చెప్పారు.