మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమయ్యింది. అనుచరులు, సన్నిహితులతో సమావేశమైన ఆనం.. చేరిక కార్యక్రమంపై చర్చించారు. సెప్టెంబర్ 2న విశాఖలో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోబోతున్నట్లు ప్రకటించారు. తనకు అందరికి సహకారం కావాలని.. చేరిక కార్యక్రమానికి హాజరవ్వాలని ఆహ్వానం పలికారు. నెల్లూరు జిల్లా నుంచి భారీగా అనుచరుల్ని వెంట తీసుకెళ్లి.. పార్టీలో చేరేందుకు ఆనం సిద్ధమవుతున్నారు. ఈ ఏర్పాట్లను కూడా ముమ్మరంగా చేస్తున్నారు. మరోవైపు టిక్కెట్ విషయంపై ఆనం స్పందించారు. ఎన్నికల్లో తాను ఎక్కడ నుంచి పోటీ చేసేది జగన్ నిర్ణయిస్తారన్నారు రామనారాయణరెడ్డి. ఎమ్మెల్యే, ఎంపీ ఏ సీటుకైనా పోటీ చేసేందుకు సిద్ధమని చెప్పారు. టిక్కెట్ హామీ తీసుకొని పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్ని ఆయన కొట్టిపారేశారు. అలాగే టీడీపీపై కూడా విమర్శలు చేశారు ఆనం. ఆ పార్టీకి ఓ సిద్ధాంతం లేదని.. కక్షసాధింపుతో రాజకీయాల్లో మనుగడ సాధించలేరన్నారు. అందుకే ఆ పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు.
కాంగ్రెస్ హయాంలో ఆనం రామనారాయణ రెడ్డి మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో కూడా ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో తన సోదరుడు ఆనం వివేకానందరెడ్డితో కలిసి టీడీపీ గూటికి చేరారు. తర్వాత సోదరుడి మరణం.. నేతల మధ్య కోల్డ్వార్తో పార్టీ వీడాలని భావించారు. అనుచరులు, సన్నిహితుల అభిప్రాయం మేరకు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.