భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఏషియాడ్లో రజతంతో సరిపెట్టుకుంది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్లో వరల్డ్ నంబర్ చైనీస్ తైపీ ప్లేయర్ తై జు యింగ్తో 13-21, 16-21 తేడాతో సింధును ఓడించింది. దీంతో ఏషియాడ్లో స్వర్ణం నెగ్గిన తొలి భారత షట్లర్గా నిలిచే అవకాశాన్ని సింధు కోల్పోయింది. సెమీస్లో సైనాను ఓడించిన తై జు.. ఫైనల్లోనూ అద్భుత ఆటతీరు కనబర్చింది. ఆరంభం నుంచి ఆధిక్యం కనబర్చిన చైనీస్ తైపీ ప్లేయర్.. వరుస గేముల్లో సింధును ఓడించింది. సోమవారం జరిగిన సెమీస్లో జపాన్కు చెందిన యమగుచిపై 21-17, 15-21, 21-10 తేడాతో సింధు విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా ఏషియాడ్ ఫైనల్ చేరిన తొలి భారత బ్యాడ్మింటన్ ప్లేయర్గా తెలుగు తేజం చరిత్ర సృష్టించింది. సెమీస్లో ఓడిన సైనా ఖాతాలోనూ కాంస్యం చేరింది. ఏషియాడ్లో భారత షట్లర్లు రెండు పతకాలు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.