కేంద్రం నిధులతోనే రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నట్లుగా బిజెపి నేతలు సన్నాయి నొక్కులు నొక్కడం హాస్యాస్పదం. కేంద్రం సక్రమంగా సహకరిస్తే ఆంధ్రప్రదేశ్ కు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కేంద్రం తోడ్పాటే ఉంటే నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని ప్రయత్నాలు ఎందుకు చేయాల్సివస్తుందని అన్నారు. బాండ్స్ కు వెళ్లడం, రుణాలు తెచ్చుకోవడం ప్రయత్నాలన్నీ కేంద్రం సహకారం లేనందువల్లే..రాష్ట్రంపై భారం ఎక్కువ అయినా కేంద్రం సహకరించ నందువల్లే స్వంతంగా నిదులను సమీకరించాల్సి వస్తోంది. ఈ విషయాలన్నీ రాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసిందే. ప్రజలకు సరైన సమాధానం చెప్పలేకే బిజెపి నేతలు ఈవిధమైన అసత్య ఆరోపణలు చేస్తున్నారు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంస్థల విభజన ఇంతవరకు ఒక కొలిక్కి తేకుండా ఏపిని అన్నిరకాలా కష్టాలలోకి నెట్టారని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.40వేల కోట్లు కావాలని డిపిఆర్ ఇస్తే, కేవలం రూ.1500కోట్లు ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకుంది. ఇంతకన్నా అవకాశ వాదం మరొకటి ఉంటుందా అని అయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని శ్వేత పత్రం విడుదల చేయమని బిజెపి నేతలు కోరడం కన్నా జోక్ మరొకటిలేదు. కావాలంటే కేంద్రాన్నే శ్వేత పత్రం విడుదల చేయమని ఏపి బిజెపి నేతలు కోరాలి. ఏపి పునర్విభజన చట్టంలో అంశాల అమలు, అప్పటి ప్రధాని పార్లమెంటులో ఇచ్చిన హామీలు, ప్రస్తుత ప్రధాని ఎన్నికల ప్రచారంలో, అమరావతి శంకుస్థాపనలో ఇచ్చిన హామీల అమలుపై కేంద్రాన్నే శ్వేత పత్రం విడుదల చేయమనండని అయన అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం దుబారా చేస్తోందనడం మరో అబద్దపు ప్రచారం.అసలు దుబారా జరిగితే కదా శ్వేత పత్రం విడుదల చేసేది. కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడంలేదు. రాష్ట్రం తెచ్చుకుంటుంటే అడ్డం పడుతున్నారని యనమల అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పద్ధతిలోనే బిజెపి వ్యవహరిస్తోంది. అభివృద్దికి ఆటంకాలు కల్పించడం, అవినీతి ఆరోపణలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేయడమే ధ్యేయంగా బిజెపి వ్యవహరిస్తోంది. వైకాపా, బిజెపి కుట్ర రాజకీయాలకు రాష్ట్ర ప్రజలు తిరుగులేని గుణపాఠం చెబుతారని అన్నారు.