రాజధాని నిర్మాణానికి రూట్ మ్యాప్ వేస్తోంటే బీజేపీ నేతలు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అనిల్ అంబానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టి విదేశీ మదుపర్లు తీవ్రంగా నష్టపోయారు. అలాంటి అనిల్ అంబానీ గ్రూపుతో కేంద్రం రాఫెల్ డీల్ చేసుకుందని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు విమర్శించారు. రాఫెల్ కుంభకోణంతో దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ మదుపర్లు భయపడుతున్నారు. చంద్రబాబును చూసే పెట్టుబడులు పెడుతున్నామని పారిశ్రామికవేత్తలే చెబుతున్నారు. బీజేపీ నేతల ఆరోపణలన్నీ అసూయ నుంచి వచ్చిందే. తన కారు వల్ల ప్రమాదానికి గురైన బాధిత కుటుంబాలకు జీవీఎల్ ఒక్క రూపాయైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. మాటలు చెప్పడమే తప్ప.. నిధులు ఇవ్వకపోవడమనేది బీజేపీ నైజం. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోన్న వడ్డీ రేటు కంటే తక్కువ వడ్డీకి రుణం తీసుకొస్తే.. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తోన్న మార్చంటైజ్ కమిషన్ కంటే ఎక్కువగా ఇస్తాం. ప్రతి కేంద్ర ప్రభుత్వ కార్పోరేషన్ ఇదే విధంగా రుణాలు సమీకరిస్తాయని అన్నారు. బాండ్ల విషయంలో అవినీతి జరిగిందని.. నిబంధనల ఉల్లంఘన జరిగిందని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా.తప్పుడు ఆరోపణలు చేస్తోన్న జీవీఎల్ రాజీనామా చేయకున్నా.. క్షమాపణలు అయినా చెబుతారా..? రాఫెల్ కుంభకోణం విషయంలో జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయగలరా..? తప్పుడు ఆరోపణలు చేస్తూ జీవీఎల్ విషం కక్కుతున్నారు. నష్టాల్లో ఉన్న జీఎస్పీసీ సంస్ధను ప్రధాని ఓఎన్జీసీతో కొనిపించారని అన్నారు. గుజరాత్ సీఎంగా మోడీ ఉన్నప్పుడు జీఎస్పీసీ విస్తరణ కోసం పది శాతం వడ్డీకి పైగా వేయి కోట్లకు బాండ్లు జారీ చేశారు. అదీ 60 ఏళ్ల పాటు వడ్డీ కడతామన్నారు. ఇవేవీ జీవీఎలుకు కన్పించవా అని నిలదీసారు. బాండ్ల జారీతో రాష్ట్ర ప్రతిష్ట పెరిగిందే తప్ప దిగజారలేదు. పార్టీకి బాండ్ల నిధులను ఎలా మళ్లిస్తారు..? ప్రధాని మోడీ కేంద్ర నిధులను బీజేపీకి మళ్లిస్తున్నారా..? బీహార్లో శ్రీజం స్కామ్ జరుగుతోంది. ప్రభుత్వ నిధులను ప్రైవేటు వ్యక్తుల ఖాతాలకు మళ్లించి.. తిరిగి ప్రభుత్వ ఖాతాలకు తేవడమే శ్రీజం స్కామ్. బీహార్ ఆర్ధిక మంత్రిగా బీజేపీకి చెందిన సుశీల్ మోడీనే ఉన్నారు. హడ్కో నుంచి తక్కువ వడ్డీకి రుణం ఇప్పించేలా బీజేపీ కృషి చేయొచ్చు కదా..? టాక్స్ ఫ్రీ అమరావతి బాండ్లకు అనుమతి ఇవ్వమంటే.. కేంద్రం ఇవ్వడం లేదు. సీఆర్డీఏ సొంతంగా ఆదాయం సమకూర్చుకుంటోంది. సుమారు రూ. 500 కోట్ల వరకు సీఆర్డీఏ ఆదాయం ఉండొచ్చని అంచనా. రాజధాని నిర్మాణం కోసం తీసుకుంటున్న రుణం.. రాష్ట్ర ప్రభుత్వ శాఖలపై భారం పడదని అయన అన్నారు.