సినీ నటుడు నందమూరి హరికృష్ణ సినీ పరిశ్రమలో వచ్చిన ఫేమ్‌తో రాజకీయాల్లో ప్రవేశించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ హరికృష్ణ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడయ్యాడు. ఆ పార్టీ తరపున ఒకసారి రాజ్యసభకు కూడా నామినేట్ అయ్యాడు. అప్పట్లో రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేశారు. రాజకీయాల్లో వివిధ పదవులు నిర్వహించినప్పటికీ సినిమాల ద్వారానే ఆయన ప్రజల్లోకి ఎక్కువగా చేరువయ్యారు. శ్రీకృష్ణావతారం చిత్రంలో బాలకృష్ణుడి పాత్రతో బాలనటుడిగా సినీ రంగంలో ప్రవేశించారు. తర్వాత 1970లో తల్లా పెళ్ళామా చిత్రంలో సైతం బాలనటుడిగా నటించారు. 1974లో తాతమ్మకల సినిమాతో పూర్తిస్థాయి నటుడిగా మారారు. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు రావడమైంది. 1996-99 మధ్య ఎమ్మెల్యేగా పనిచేసిన హరికృష్ణ.. 1996లో రవాణా మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సేవలు అందించారు. ఆపై 2008లో టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక ఆయిన హరికృష్ణ ప్రస్తుతం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన మరణంతో నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.1998లో శ్రీరాములయ్య సినిమాలో సత్యం పాత్రలో ఒదిగిపోయారు. 1999 సంవత్సరంలో సీతారామరాజు సినిమా ప్రజల్లోకి మరింతగా వెళ్లేలా చేసిందని సినీ ప్రియులు చెబుతుంటారు. ఆ తర్వాత 2002లో లాహిరి లాహిరి లాహిరిలో తన నటనా ప్రతిభను మరింత వెలికితీశారు. అదే సంవత్సరంలో శివరామరాజులో నటించారు. 2003 సంవత్సరంలో సీతయ్య సినిమాలో ఆయన చేసిన సీతయ్య పాత్ర ప్రతి తెలుగువాడికి గుర్తుంటుంది. అదే ఏడాది టైగర్ హరిశ్చంద్రప్రసాద్ సినిమాలో సైతం నటించారు. ఆ తర్వాత నుంచి సినిమాల్లో నెమ్మదించడం మొదలైంది. చివరగా 2004లో స్వామి, 2005 సంవత్సరంలో శ్రావణమాసం తర్వాత సినిమాల నుంచి దాదాపుగా వైదొలగారు.