YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి

పాఠాలు చెప్పని ప్రధానోపాధ్యాయులు..

పాఠాలు చెప్పని ప్రధానోపాధ్యాయులు..

- పరిపాలన విధులకే పరిమితం 

-   ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి ఇదీ.. 

ఒక వ్యవస్థ విజయవంతం కావాలంటే నాయకుడు దానిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. నాయకుడికి ఇతర పనులు అధికంగా ఉంటే ఆ వ్యవస్థ కుంటుపడుతుంది. ఇదే విధానం ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కొనసాగుతోంది. నిబంధనల ప్రకారం ఇతర ఉపాధ్యాయులతోపాటు ప్రధానోపాధ్యాయులూ విద్యార్థులకు పాఠాలు బోధించాల్సి ఉండగా, వారు వివిధ పనుల ఒత్తిడి కారణంగా బోధన చేయలేకపోతున్నారు. ఒక ప్రధానోపాధ్యాయుడు నిబంధనల ప్రకారం వారానికి 8 కాలాంశాలు (పిరియడ్లు) బోధించాలి. ఒక్కో కాలాంశం వ్యవధి 45 నిమిషాలు ఉంటుంది. అయితే పలువురు ప్రధానోపాధ్యాయులు సమయ పట్టికల్లో (టైంటేబుల్లో) కాలాంశాలను చూపించుకుంటున్నారే తప్ప బోధన చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

విద్యార్థులకు మెరుగైన విద్య అందించడం, ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరై పాఠాలు బోధించడం, ఉత్తీర్ణత శాతం పెరగడం వంటివి ఆయా పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయుల పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది. చాలా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు పాఠాలు చెప్పడం తమ పని కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా బోధన, బోధనేతర సిబ్బందిలో నిర్లక్ష్యం పెరుగుతోంది. మరో పక్క హెచ్‌ఎంలకు విద్యార్థులతో సత్సంబంధాలు ఉండటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. 
పరిపాలన విధులకే పరిమితం 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం  జిల్లాలో 494 ఉన్నత పాఠశాలలు ఉండగా 6వ తరగతి నుంచి పదోతరగతి వరకు సుమారు రెండు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలల్లోని హెచ్‌ఎంలలో మూడొంతుల మంది కేవలం పరిపాలన విధులకే పరిమితం అవుతున్నారని విమర్శలు ఉన్నాయి. ప్రధానోపాధ్యాయుడు 6 నుంచి పదోతరగతి వరకు ఏదో ఒక తరగతికి చెందిన పాఠ్యాంశాలను వారానికి 8 కాలాంశాలను బోధించాలి. పలువురు ఒకటి, రెండు కాలాంశాలతో మొక్కుబడిగా సరిపెట్టి పరిపాలన విధులంటూ తప్పించుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. 
పనుల ఒత్తిడి అంటూ.. 
విద్యాశాఖ పనులు కాకుండా ఇతర పనులు అప్పగించడంతో సమయం కుదరక బోధన చేయలేకపోతున్నామని పలువురు ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. జన్మభూమి గ్రామసభల బాధ్యతలు, అంగన్వాడీ కేంద్రాల తనిఖీ, ఆయా వివరాలను ఆన్‌లైన్‌ చేయడం తదితర పనులు అప్పగించడంతో వాటిపైనే దృష్టి పెట్టాల్సి వస్తోందని అంటున్నారు. 
గతంలోనే మెరుగు 
గతంలో పరిపాలన విధులు నిర్వహిస్తూనే ప్రధానోపాధ్యాయులు బోధన చేసేవారు. కాలక్రమేణా బోధన విషయం మరిచిపోయే పరిస్థితి వచ్చింది. గతం కంటే విద్యాలయాల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంచారు. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల హాజరుశాతం బయోమెట్రిక్‌ విధానంలో నమోదవుతోంది. మధ్యాహ్నభోజన పథకానికి ప్రత్యేక యాప్‌ తీసుకురావడంతో ప్రధానోపాధ్యాయులకు పనిభారం తగ్గింది. గతంలో అన్ని రాతపూర్వకంగా డీఈవో కార్యాలయం వరకు నివేదికలు పంపించే పరిస్థితులు ఉండేవి. ప్రస్తుతం కంప్యూటరీకరణలో భాగంగా పాఠశాలల్లో జరిగే అంశాలు జిల్లా కేంద్రానికి క్షణాల్లో చేరుతున్నాయి. సహప్రధానోపాధ్యాయులు కూడా పరిపాలన విధుల్లో పాలు పంచుకుంటున్నారు. 
సమావేశానికి రారంటే రారు పాఠశాలల్లో బోధన మాట అలా ఉంచితే కనీసం మండల విద్యాశాఖ కార్యాలయాల్లో జరిగే సమావేశాలకు సైతం పలువురు ప్రధానోపాధ్యాయులు హాజరుకావడం లేదు. ఆయా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులే ఎక్కువగా హాజరవుతున్నారు. అదేమని అడిగితే పరిపాలన విధుల్లో బిజీగా ఉన్నారనే సమాధానం వస్తోంది.

ఇవీ పరిపాలన విధులు 
÷ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలకు సమయానికి వచ్చేలా చూడడం 
÷ ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును సమయం ప్రకారం పర్యవేక్షించడం 
÷ పక్కాగా మధ్యాహ్నభోజన పథకం అమలు చేయడం 
÷ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉపాధ్యాయుల బోధన ఉందా లేదా అనే విషయాలను పరిశీలించడం 
÷ పాఠశాలకు విడుదల అవుతున్న నిధులపై అజమాయిషీ, ప్రతినెల ఎస్‌ఎంసీ సమావేశాలు నిర్వహించడం 
÷ విద్యార్థుల్లో చదవడం, రాయడం వంటి సామర్థ్యాలను గుర్తించడం 
÷ విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేయించడం 
÷ ఈ అంశాలను కంప్యూటరీకరణ చేయించడం వంటి పనులు ప్రధానోపాధ్యాయుడు చేపట్టాల్సి ఉంటుంది. 
తప్పని సరిగా చెప్పాల్సిందే... 
ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు పరిపాలన విధులతో పాటు నిబంధనల ప్రకారం వారానికి 8 కాలాంశాలు కచ్చితంగా బోధించాల్సిందే. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయంలో సహ ప్రధానోపాధ్యాయుల చేత వాటిని పూర్తి చేయించుకోవచ్చు. ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల కాలాంశాలను పరిశీలించి నివేదికలు అందించేలా చర్యలు తీసుకుంటాం. హెచ్‌ఎంలు తప్పని సరిగా బోధన చేయాలని మరోమారు ఆదేశాలు జారీ చేస్తామని విశాఖపట్నం జిల్లా ఉపవిద్యాశాఖాధికారి ఇన్‌ఛార్జి సునీత అన్నారు 

 

 

 

Related Posts