నందమూరి హరికృష్ణ మరణ వార్తతో ఆయన కుమారులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు శోక సంద్రంలో మునిగారు. కష్టమైనా, సుఖమైనా తమ వెంటే ఉంటూ.. వెన్నుతట్టి ప్రోత్సహించిన తమ తండ్రి ఇకలేరనే విషయాన్ని తెలుసుకుని కుమిలిపోతున్నారు. కడసారి మాటలకు కూడా నోచుకోకుండా దేవుడు ఆయన్నీ తీసుకెళ్లిపోయారంటూ ఆవేదన చెందుతున్నారు. హరికృష్ణకు తన కుమారులతో ఎనలేని అనుబంధముంది. తన తండ్రి ఎన్టీఆర్‌లా తమ కుమారులు మంచి పేరు తెచ్చుకోవాలని ఆయనతపనపడేవారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఓ కార్యక్రమంలో తెలిపారు. ఆయన నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ... ‘‘నా మీద నాకు నమ్మకం కలిగేలా చేసింది మా నాన్నగారు నందమూరి హరికృష్ణగారు. నాన్న ఎప్పుడూ మా ముగ్గురికీ.. ఒకే మాట చెప్పారు. కింద పడండి చావుదాకా వెళ్లిపోండి. కానీ, మిమ్మల్ని మీరే నమ్ముకుని పైకి రండి అన్నారు. ఏరోజు పిరికి పందాల్లా బతకడం నేర్పించలేదు మాకు. ఏ రోజు ఆయన పేరు చెప్పుకుని బతికేలా, తాతగారి పేరు చెప్పుకుని బతికేలా నేర్పించలేదు. మీరు మీరుగా బతకండిరా మా ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారు’’ అని తెలిపారు. హరికృష్ణ వ్యక్తిత్వాన్ని చెప్పడానికి ఇంతకంటే మంచి నిదర్శనం ఏముంటుంది?