టీటీడీ తనపై కక్షసాధిస్తోందన్నారు మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు. తనకు చెప్పకుండానే రిటైర్మెంట్ బెనిఫిట్ డబ్బుల్ని అధికారులు అకౌంట్‌లో వేయడంపై మండిపడ్డారు. మంగళవారం ఓ ప్రకటనలో మరోసారి టీటీడీపై విమర్శలు చేశారు. తాను దరఖాస్తు చేసుకోకుండా.. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. టీటీడీ తన పేరిట రూ.30 లక్షలు బ్యాంక్ అకౌంట్‌లో వేసిందన్నారు. తనను కక్షపూరితంగా అర్చక బాధ్యతల తొలగించి.. మళ్లీ ఏకపక్షంగా తన బ్యాంకు ఖాతాలో డబ్బులు వేశారని విమర్శించారు. తన అర్చక నిరయామకం వంశపారంపర్యం ప్రకారం జరిగిందంటున్నారు రమణ దీక్షితులు. సర్వీస్ రూల్స్ ప్రకారం కాదని.. అందుకే 30ఏళ్ల పాటూ అర్చక బాధ్యతల్లో కొనసాగిన తనకు ఎలాంటలి అలవెన్స్‌లు, సర్వీస్‌కు సంబంధించిన ఉత్తర్వులు లేవన్నారు. తన సమ్మతి లేకుండానే పదవీ విరమణ జరిగిందని.. ఇప్పుడు తనకు చెప్పకుండానే రిటైర్మెంట్ సెటిల్మెంట్ డబ్బును అకౌంట్‌లో వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తనతో పాటు పదవీ విరమణ పొందినవారికి కూడా అకౌంట్లలో కూడా డబ్బు జమ చేశారన్నారు. ఎలాంటి రశీదు, ఉత్తర్వులు లేకుండా.. ఎవరూ దరఖాస్తు చేసుకోకుండా టీటీడీ ఇలా డబ్బును ఎలా జమ చేస్తారని ప్రశ్నించారు రమణ దీక్షితులు. తమకు చెప్పకుండానే అకౌంట్లలోనే ఇంత డబ్బు వేసినవారు.. ఇంకెన్ని నిధుల్ని దుర్వినియోగం చేశారోనని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంతో టీటీడీపై తాను చేస్తున్న విమర్శలు నిజమేననే విషయం తేట తెల్లమవుతుందన్నారు. త్వరలోనే ఈ పరిణామాలన్నిటిపై కోర్టును ఆశ్రయిస్తానన్నారు రమణ దీక్షితులు.