సినీ నటుడు, మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు.. అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. హరికృష్ణ కుటుంబ సభ్యులను సంప్రదించి అంత్యక్రియ ఏర్పాట్లను చేయాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. ఇవాళ ఉదయం 6.15గంటలకు నల్లగొండ జిల్లాలోని అన్నెపర్తి వద్ద రోడ్డుప్రమాదంలో హరికృష్ణ మృతి చెందిన విషయం విదితమే. రేపు మొయినాబాద్ మండలంలోని ముర్తుజగూడలోని ఫాంహౌస్‌లో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. రాజకీయాల్లో హరికృష్ణ ప్రస్థానాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ తనయుడిగానే కాకుండా కుటుంబ రాజకీయాల్లో ఓ రెబల్‌గా హరికృష్ణ ప్రత్యేకంగా నిలిచారు. తన తండ్రి పార్టీ పెట్టిన సమయంలో ఆయన చైతన్య యాత్రకు రథసారథిగా ఆయనే వ్యవహరించారు. 9 నెలల పాటు ఎన్టీఆర్ చైతన్య రథాన్ని ఆయనే నడిపారు. తండ్రితో కలిసి రాష్ట్రం మొత్తం నాలుగుసార్లు పర్యటించారు. అయితే అలాంటి వ్యక్తి 1995లో తన తండ్రికి వెన్నుపోటు పొడిచి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన చంద్రబాబుకు అప్పట్లో అండగా నిలిచారు. ఆయన ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. 1996లో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 1999 వరకు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత చంద్రబాబుకు ఎదురుతిరిగారు.1999 జనవరి 26న అన్నా టీడీపీ పార్టీ స్థాపించారు. 1999 ఎన్నికల్లో పోటీ చేసినా ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు. ఆయన తమ్ముడు బాలకృష్ణ.. బాబువైపు నిలిచినా హరికృష్ణ మాత్రం చాలా కాలం బాబుకు దూరంగా ఉంటూ వచ్చారు. 2009 ఎన్నికలకు ముందు మరోసారి హరికృష్ణ, ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్‌లను బాబు మరోసారి దగ్గరకు తీశారు. దీంతో ఆ ఎన్నికల్లో ఇద్దరూ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఆ తర్వాత హరికృష్ణ రాజ్యసభ ఎంపీ అయ్యారు. అయితే రెండోసారి ఆయనను రాజ్యసభకు పంపకపోవడంతో బాబుతో మరోసారి విభేదాలు వచ్చి కొంతకాలంగా దూరంగానే ఉంటున్నారు.కాగాసినీ నటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ మృతి టీడీపీకి, ఆంధ్రప్రదేశ్‌కు తీరని లోటు అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన చెందారు. హరికృష్ణ మృతిపట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నటుడిగా హరికృష్ణ తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు చంద్రబాబు. సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మక పాత్రలో హరికృష్ణది అందెవేసిన చేయి అని తెలిపారు. చలనచిత్ర రంగానికి, రాజకీయ రంగానికి హరికృష్ణ ఎనలేని సేవలందించారని గుర్తు చేశారు ఏపీ సీఎం. ఎన్టీఆర్‌కు హరికృష్ణ అత్యంత ఇష్టుడు అని తెలిపారు. ఎన్టీఆర్ చైతన్య రథసారథి నందమూరి హరికృష్ణ అని తెలిపిన చంద్రబాబు.. స్వయంగా ఆ రథాన్ని డ్రైవింగ్ చేస్తూ ఎన్టీఆర్‌ను ప్రజలకు చేరువ చేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే, మంత్రి, రాజ్యసభ సభ్యునిగా హరికృష్ణ ఎనలేని సేవలు అందించారని చంద్రబాబు తెలిపారు.టీడీపీ మాజీ ఎంపీ, సినీ నటుడు హరికృష్ణ మృతితో ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లా నిమ్మకూరు కన్నీరుమున్నీరవుతున్నది. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని అక్కడి వాళ్లు నెమరు వేసుకుంటున్నారు. చిన్ననాటి నుంచి వివాహమయ్యే వరకు హరికృష్ణ నిమ్మకూరులోనే ఉన్నారు. ఆయన చదువంతా అక్కడే సాగింది. స్థానిక అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆయన హఠాన్మరణం నిమ్మకూరు ప్రజలను కలచివేస్తున్నది. సినిమాల్లో నటిస్తూ ఎంపీ అయిన తర్వాత కూడా ఎప్పుడు స్వగ్రామానికి వచ్చినా.. అందరితో ఎంతో కలివిడిగా ఉండేవాళ్లని అక్కడివాళ్లు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఎంపీగా ఉన్న సమయంలో తన ఎంపీలాడ్స్ నుంచి మూడున్నర కోట్లు మంజూరు చేయించి.. ఊళ్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టారని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ తర్వాత స్వగ్రామంలో ఆస్థాయి చరిష్మా హరికృష్ణకే ఉంది.