రాష్ట్రంలో విజయవాడ-గూడూరు మూడవ రైల్వే లైన్ నిర్మాణ వివరాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైల్వే బోర్డు చైర్మన్ అశ్వని లోహానిని అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. విజయవాడ-గూడూరు మధ్య మూడవ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణకు సంబంధించి, ఇతర చిన్నచిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని త్వరలో పరిష్కరిస్తామని లోహాని ప్రధానికి చెప్పారు. ఈ రైల్వే లైన్ పొడవు 288 కిలోమీటర్లని తెలిపారు. ఆ తరువాత ఎన్నోర్-తిరువళ్లూర్-బెంగళూరు-పుదుచ్చేరి-నాగపట్నం-మదురై-టూటికోరన్ గ్యాస్ పైప్ లైన్ గురించి కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎంఎం కుట్టీ ప్రధానికి వివరించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో 1244 కిలోమీటర్ల పొడవున ఈ పైప్ లైన్ నిర్మిస్తారని చెప్పారు. ఈ పైప్ లైన్ ని 5 దశలలో నిర్మిస్తారని, ఫారెస్ట్ భూమి, ప్రైవేటు భూమికి సంబంధిచి కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి పర్యావరణ నివేదిక కూడా రావలసి ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఫారెస్ట్ భూమి, ఇతర భూసేకరణ వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ప్రధానికి తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.