భారీ వర్షాల ధాటికి అతలాకుతలమైన కేరళకు కేంద్ర ప్రభుత్వం సరైన సాయం చేయట్లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. తాను ఈ విషయాన్ని రాజకీయం చేయట్లేదని, కేంద్రం ఆ రాష్ట్రానికి సాయం చేయాలని అన్నారు. కేరళలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సరైన విధంగా సాయం చేయకపోవడం పట్ల నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి వరద బాధితులు సాయం పొందడం వారి హక్కు. బాధితుల పక్షాన నేను మాట్లాడాల్సి ఉంది. నేను ఈ విషయాన్ని రాజకీయం చేయట్లేదు’ అని వ్యాఖ్యానించారు. యూఏఈలాంటి దేశాల నుంచి విరాళాలు తీసుకునే అంశంపై ఆయన స్పందిస్తూ.. తాను విదేశాల నుంచి విరాళాల సేకరణకు మద్దతు తెలుపుతానని అన్నారు. ‘కేరళ ప్రజలు కష్టాలను అధిగమించేందుకు ఎవరైనా భేషరతుగా విరాళాలు ఇస్తే నేను తీసుకోమనే చెబుతాను’ అని అన్నారు.తాను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాట్లాడానని, ఆ రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా సహాయక చర్యలను నిర్వహిస్తోందని రాహుల్ గాంధీ ప్రశంసించారు. అలాగే, వరద బాధితులకు ప్రకటించిన రూ.10,000 సాయాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాను సహాయక శిబిరాలను పరిశీలించి, బాధితులతో మాట్లాడి వారి సమస్యల గురించి తెలుసుకున్నానని చెప్పారు. కాగా, నిన్న ఆలప్పుళా, ఎర్నాకులం, త్రిశూర్ జిల్లాల్లో పర్యటించిన రాహుల్.. వరద బాధితులకు సాయం చేయాలని తమ పార్టీ కార్యకర్తలను కోరారు.