తిరుమల వేంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 13వ తేదీ నుంచి జరగనున్నాయి. దీనికిగాను తిరుమల, తిరుపతిలను అత్యంత శోభాయమానంగా టీటీడీ తీర్చిది ద్దుతోంది. ఇల వైకుంఠాన్ని తలపించేలా అలంకరణలు, విద్యుత్తు దీపాలతో పాటు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా ముందస్తు చర్యలను తీసుకుంటోంది. ఈసారి అధికమాసం ఉండటంతో రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. సెప్టెంబరు 13 నుంచి 21వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండగా, అక్టోబరు పదో తేదీ నుంచి 18వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రెండు బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లను టీటీడీ చేపడుతోంది. అయితే ఈసారి వాహన సేవలలో స్వల్ప మార్పులు ఉండబోతున్నాయి.ఉదయం జరిగే వాహనసేవలు యథావిధిగా ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు కొనసాగుతాయి. అయితే రాత్రి సమయాల్లో జరిగే వాహన సేవలను భక్తుల సౌకర్యార్థం ఒక గంట ముందుగా చేపడుతున్నారు. రాత్రి 9.00 గంటలకు బదులుగా రాత్రి 8.00 గంటల నుంచే వాహన సేవలు ప్రారంభించి, పది గంటలకు మగిసేలా చర్యలు తీసుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టైమెన గరుడ సేవను మరో గంట ముందుగా అంటే రాత్రి 7.00 గంటలకే ప్రారంభిస్తారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని, సెప్టెంబరు 11వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడతారు. 12వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజారోహణం రోజున అంటే ఈనెల 13వ తేదీ తిరుమలకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అయితే ఆయన పర్యటన పూర్తిస్థాయిలో ఖరారు కాలేదని తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వివరాలు
13.09.2018 ధ్వజారోహణం-పెద్ద శేష వాహనం
14.09.2018 చిన్న శేష వాహనం-హంస వాహనం
15.09.2018 సింహ వాహనం- ముత్యపు పందిరి వాహనం
16.09.2018 కల్పవృక్ష వాహనం-సర్వభూపాల వాహనం
17.09.2018 మోహినీ అవతారం-గరుడవాహనం
18.09.2018 హనుమంత వాహనం-స్వర్ణరథం- గజవాహనం
19.09.2018 సూర్యప్రభ వాహనం-చంద్రప్రభ వాహనం
20.09.2018 రథోత్సవం-అశ్వ వాహనం
21.09.2018 చక్రస్నానం-ధ్వజావరోహణం