YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

పీడిస్తున్న జ్వరమరణాలు... డెంగీ, మలేరియా,టైఫాయిడ్ లతో బెంబేలు

 పీడిస్తున్న జ్వరమరణాలు... డెంగీ, మలేరియా,టైఫాయిడ్ లతో బెంబేలు
విజయనగరం జిల్లాలో జ్వర మరణాలు అత్యవసర పరిస్థితిని తలపిస్తున్నాయి. ప్రజలు డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాలతో బెంబేలెత్తిపోతున్నారు. పైగా గత రెండు నెలల వ్యవధిలోనే 57 మంది మరణించడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయం అందరినీ వెంటాడుతోంది.  జిల్లాలో 57 మంది చనిపోతే అధికారిక లెక్కల ప్రకారం మాత్రం ఒకే ఒక్క జ్వర మరణం నమోదైంది. మరి మిగతా మరణాలు ఎందుకు సంభవించాయని జిల్లా వైద్యశాఖ ఉన్నతాధికారుల్ని ప్రశ్నిస్తే అవన్నీ ఇతరత్రా మరణాలంటారు. అదే నిజమైతే, ఈ చావులన్నీ జ్వరాల వల్ల కాకపోతే వెంటనే కారణాల్ని కనుక్కోవడానికి పరిశోధన బృందాల్ని తీసుకురావాల్సిన అవసరముంది. పైగా జిల్లాలో వేలాదిమంది ప్లేట్‌లెట్లు పడిపోయాయంటూ ప్రభుత్వాసుపత్రులకు రావడం, ఇక్కడి నుంచి రిఫర్‌ చేసేస్తే తిరిగి విశాఖపట్టణంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఒకేసారి ఇంతభారీ స్థాయిలో ప్లేట్‌లెట్లు పడిపోవడంపైనా పరిశోధన జరగాల్సిందే..ఇంతటి దుస్థితి ఉన్నా జ్వరాలకు కారణమైన దోమల్ని నివారించేందుకు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలన్న స్పృహ జిల్లా పంచాయతీశాఖ అధికారులకు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి వర్షాకాలానికి ముందే గ్రామగ్రామాన పారిశుద్ధ్య పనులు చేపట్టి దోమలకు ఆవాసాలు దొరక్కుండా జాగ్రత్త పడాలి. అయినా జిల్లాలో నెలల తరబడి కాలువలు శుభ్రం చేయకపోయినా అడిగేవాళ్లు లేరు. చివరికి జ్వర మరణాలు నమోదైన గ్రామాల్లోను ఫాగింగ్‌, స్ప్రేయింగ్‌ జరగట్లేదంటే ఇంకేమనాలో అర్థం కాని పరిస్థితి.మరోవైపు జిల్లాలో జ్వరమొచ్చి ప్లేట్‌లెట్లు పడిపోయిన కేసులు వందలాదిగా ఉంటున్నాయి. వారంతా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళుతున్నా తమకెందుకు వచ్చిన గొడవని ఇతర ప్రాంతాలకు రిఫర్‌ చేసేస్తున్నారు. దీనివల్ల ప్లేట్‌లెట్లు పడిపోయిన రోగులంటేనే కార్పొరేట్‌, ప్రైవేటు ఆసుపత్రులకు కాసులు కురిపించే కార్ఖానాలుగా మారిపోతున్నారు. ఆసుపత్రిలో చేర్చుకుని వైద్యమందిస్తే చాలు ఒక్కో రోగి నుంచి తక్కువలో తక్కువ రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవొచ్చు. అందుకే ఈ ఒక్క సీజన్‌లోనే వందలాది కుటుంబాలు జ్వరాలకు చికిత్స చేయించుకోవడం కోసం అప్పుల ఊబిలోకి జారిపోయాయంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి పరిస్థితి ఎక్కడున్నా సంబంధిత జిల్లా యంత్రాంగం స్పందించి చర్యలకు పూనుకుంటుంది. కాని మన జిల్లా ఉన్నతాధికారులు మాత్రం చావుల్ని పరిగణనలోకే తీసుకోవడం లేదంటే వారి నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది.   ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా ఇంతవరకూ అధికారులందరితో కలిపి ఒక్క సమీక్ష సమావేశం నిర్వహించే తీరికైనా ప్రజప్రతినిధులెవరికీ లేకపోయింది. అందుకే ప్రజల నుంచి సైతం తీవ్ర విమర్శలు రేగుతున్నాయి.పారిశుద్ధ్యం బాగుండట్లేదని జిల్లా అధికారులను ప్రశ్నిస్తే జిల్లాలోని పది మేజర్‌ పంచాయతీల్లో 39 మంది సిబ్బంది ఉన్నారని, మిగతాచోట్ల సిబ్బంది కొరత వేధించడం వల్లే పారిశుద్ధ్యాన్ని డ్రైవ్‌ తరహాలోనే చేస్తున్నామని చెబుతున్నారు. అందుకే ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా మురుగు కాలువలు తీయకుండా, చెత్త కొండల్లా పేరుకోవడంతో దోమలు పెరిగిపోయి జ్వరాలకు కారణమవుతున్నాయి. ఇప్పటికైనా కారణాలను పక్కకుబెట్టి పరిష్కారాలు వెదికి అవసరమైతే సిబ్బందిని నియమించుకునైనా యుద్ధపాత్రిపదికన ఊరూరా చెత్త తొలగించే పనులు ప్రారంభం కావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల సంక్షేమం కోసం ప్రతి గ్రామాన్ని స్వచ్ఛధామంగా మార్చాలి.డెంగీ వచ్చిన రోగులు ఏవైనా మందులు వాడితే వెంటనే తగ్గినట్లుగానే ఉంటుంది. కాని మళ్లీ మళ్లీ జ్వరం వస్తుంటుంది. ప్లేట్‌లెట్లు తగ్గిపోతున్న రోగులకు ఎప్పటికప్పుడు రక్తపరీక్షలు నిర్వహించాలి. లేదంటే ఒక్కసారిగా ఉపద్రవం వచ్చి మరణించే ప్రమాదముంది. మన కేంద్రాసుపత్రితో సహా చాలా ఆసుపత్రుల్లో ప్లేట్‌లెట్లు తగ్గిపోయాయని వస్తున్న రోగులను సైతం ఏదొక పరీక్షల పేరుతోనో, మందులు రాసిచ్చో పంపేస్తున్నారు. దీనివల్ల వైద్యం జాప్యమై మరణపు అంచులకు చేరుకుంటున్నారు. ప్లేట్‌లెట్లు పడిపోయిన కేసులను ప్రైవేటుకు రిఫర్‌ చేసి సొమ్ములు చేసుకునే ఇంటిదొంగలు సైతం లేకపోలేదు. అందుకే జిల్లా కేంద్రాసుపత్రితో పాటు పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిలోను జ్వరాల కేసుల కోసం ప్రత్యేక వార్డులు కేటాయించాలి. అక్కడే ప్రత్యేక వైద్య బృందాలను  నియమించాలి. వచ్చినవారికి వచ్చినట్లుగా వైద్యమందిస్తే జ్వరపీడితులను మృత్యువు రాక ముందే కాపాడుకోవొచ్చు. ఇప్పటివరకూ జ్వరమరణాలు నమోదైన, జ్వరాలు ఎక్కువగా వస్తున్న గ్రామాల్లో వెంటనే వైద్యశిబిరాలు నిర్వహించి అక్కడి పారిశుద్ధ్యాన్ని మెరుగు చేయించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇన్‌ఛార్జి మంత్రి గంటా, జిల్లా మంత్రి రంగారావులిద్దరూ వెంటనే జిల్లా అధికారులందరితో సమీక్ష సమావేశం నిర్వహించి పూర్తిస్థాయి చర్యలకు పూనుకోవాల్సిన అవసరముంది.జిల్లాలో 15 మేజర్‌ పంచాయతీలను కలుపుకుని మొత్తంగా 920 పంచాయతీలున్నాయి. గతేడాది పంచాయతీలన్నింటికి కలిపి 14 ఆర్థిక సంఘం నిధుల రూపేణా రూ.79.29 కోట్లు వచ్చాయి. జనాభా ప్రాతిపదికన ఆయా పంచాయతీల ఖాతాలకు నిధులు వెళ్లిపోయాయి. వచ్చిన దాంట్లో 15 శాతం నిధుల్ని పారిశుద్ధ్య నిర్వహణకు వినియోగించుకోవొచ్చు. ఇవే కాకుండా ప్రతి పంచాయతీకి పన్నుల రూపేణా వచ్చే సాధారణ నిధుల నుంచి మరో 15 శాతం వరకూ పారిశుద్ధ్య మెరుగుకు ఖర్చు చేసుకోవొచ్చు. జిల్లాలో సాధారణ నిధులు 105 పంచాయతీల్లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు, 15 పంచాయతీల్లో రూ.10 లక్షల కంటే ఎక్కువగా, 800 పంచాయతీల్లో రూ.5 లక్షల్లోపు వస్తున్నాయి. అయితే మన జిల్లాలో ఆయా నిధులన్నీ కాగితాల్లో ఖర్చు చూపించడమే తప్ప పనులు జరగట్లేదు.

Related Posts