బందరు ఓడరేవు కలను సాకారం చేసేందుకు సమిష్టిగా కృషి చేస్తామని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి పోర్టు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేయించనున్నట్లు తెలిపారు. పోర్టుతో పాటు కృష్ణా విశ్వ విద్యాలయం నూతన భవనం, భవానీపురం-ఉల్లిపాలెం మధ్య కృష్ణానదిపై నిర్మించిన వంతెనను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. సీఎం పర్యటన తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఓడరేవుతో పాటు ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధిపర్చేందుకు గాను మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ముడ)ను ఏర్పాటు చేశామన్నారు. సీఆర్‌డీఎ తర్వాత ప్రాధాన్యతను సంతరించుకున్న ముడకు చైర్మన్‌గా సీనియర్ రాజకీయ నాయకుడైన బూరగడ్డ వేదవ్యాస్‌ను నియమించడం శుభ పరిణామమన్నారు. 420 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ముడ పరిధిలోని రానున్న రోజుల్లో మరింత విస్తరించి అభివృద్ధికి బృహత్తర ప్రణాళికతో ముందుకు సాగనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ముడ ద్వారా పోర్టు నిర్మాణానికి అవసరమైన 5వేల 300 ఎకరాలకు గాను 4వేల ఎకరాల వరకు సేకరించినట్లు తెలిపారు. ఇందులో 3వేల 100 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఉన్నాయన్నారు. మిగిలిన పట్టా భూములను కూడా త్వరలోనే భూమి కొనుగోలు పథకం కింద కొనుగోలు చేసి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. రైతులకు పరిహారం చెల్లింపు విషయంలో రుణం ఇచ్చేందుకు ఇండియన్ బ్యాంక్ అధికారులు ముందుకు వచ్చారన్నారు. ముఖ్యమంత్రితో బ్యాంకర్లు భేటీ అయిన తర్వాత పరిహారం చెల్లింపుకు అయ్యే రూ.1350కోట్లను రుణంగా మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. 2015 ఆగస్టు 28వ తేదీన జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌కు కాలం చెల్లిందన్నారు. రైతుల భూములపై ఉన్న ఆంక్షలన్నీ తొలగిపోయాయని, రైతులు తమ తమ భూములను క్రయ, విక్రయాలు చేసుకోవచ్చని వారు తెలిపారు.