కర్నాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి తన పదవిలో సెంచరీ కొట్టడం.. అదే నూరురోజులు పూర్తి చేసుకోవడం ఓ గొప్ప విషయమే. పిడికెడు స్థానాలున్న తనను తట్టెడు స్థానాలున్న కాంగ్రెస్ సమర్థించి సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. అందుకు కృతజ్ఞతగా శతదినోత్సవ శుభవేళ ఆయన ఢిల్లీకి వెళ్లి రాజీవ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పనిలోపనిగా మంత్రివర్గ విస్తరణ గురించి ఓ మాట తీసుకున్నారని తెలిసింది. ఎందుకంటే ఆయన నడుపుతున్నది సంకీర్ణ ప్రభుత్వం. సంకీర్ణమంటే కత్తిమీద సాము. ఎవరిని ఏమంటే ఏం తంటా వస్తుందోనని ఒకటే బెదురు. ఓసారి తన కష్టాల గురించి ఆయన మీడియా ముందు బోరుమన్నారు కూడా. తమవాళ్లు కుమారస్వామికి చుక్కలు చూపిస్తున్నారని కాంగ్రెస్ పెద్దలే ఓ సందర్భంలో అంగీకరించక తప్పలేదు. ఈ బాధలు పడలేక సీఎం కుమారస్వామి గుడిబాట పట్టారు. ఈ వందరోజుల్లో ఆయన 80 రోజులు గుళ్లూగోపురాల్లో ప్రదక్షిణలు చేస్తూనే గడిపారు మరి.