జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ మొత్తం యాత్ర చేస్తానని చెబుతూ మూడు నెలల కిందట ఇచ్చాపురం నుంచి పోరాటయాత్ర ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకూ ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో మాత్రమే యాత్ర కొనసాగింది. యాభై రోజుల షెడ్యూల్‌లో ఉత్తరాంధ్రను కంప్లీట్ చేశారు. నిజానికి ఆయన నియోజకవర్గాల్లో పోరాటాలు చేసింది పదిహేను రోజులు మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆయన రోజుకు రెండు నియోజకవర్గాలు ఒక్కో రోజు మూడు నియోజకవర్గాలు పూర్తి చేశారు. మధ్యలో సెక్యూరిటీ సమస్యలు, జ్వరాలు పండుగులతో కాలం గడిచిపోయింది. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో యాత్ర మొదలైంది. అక్కడ కూడా రెండు సార్లు అర్థంతరంగా ముగిసింది. ఇప్పటికి రెండు వారాలు గడిచినా తదుపరి యాత్ర మళ్లీ ఎప్పటి నుండో జనసేన అత్యున్నత వర్గాలకూ కూడా అర్థం కావడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఇటీవలే పవన్ కల్యాణ్ కంటికి శస్త్ర చికిత్స జరిగింది. ఐదారు రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సలహాలిచ్చారు. ఆ సమయం కూడా దాటిపోయింది. అన్న చిరంజీవి పుట్టిన రోజుకు కుటుంబ సమేతంగా ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు కూడా చెప్పి వచ్చారు పవన్. దీనినిచూసిన అభిమానులు జనసేనాధినేత నుంచి పోరాటయాత్రపై తాజా ప్రకటన వస్తుందని ఎదురు చూస్తున్నారని సమాచారం.
ఎన్నికల వాతావరణం ఇప్పటికే రాజుకుంది. వచ్చే ఏప్రిల్, మేలో ఎన్నికలు జగనున్నాయని తెలుస్తోంది. అలా చూస్తే సరిగ్గా ఏడెనిమిది నెలలు కూడా లేవు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఇంతవరకూ అనుసరించిన వేగాన్ని బట్టి చూస్తే మూడు నెలలకు మూడు జిల్లాలు మాత్రమే కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా పది జిల్లాలు మిగిలి ఉన్నాయి. వాటిని పూర్తి చేసే సరికి ఎన్నికలు ముంచుకురావడం ఖాయమని తెలుస్తోంది. మరో వైపు తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు వచ్చేసింది. కేసీఆర్ అధికారిక ప్రకటన చేయడమే మిగిలినట్టు కనిపిస్తోంది. తెలంగాణపైనా దృష్టి పెడతానని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. అయితే ఇంత వరకూ దీనిపై ఒక్క కీలకమైన నిర్ణయం కూడా తీసుకోలేదు. ఏపీ సంగతి తర్వాత చూద్దాం. ముందు తెలంగాణలో ఎన్నికలొస్తున్నాయి కాబట్టి పొత్తుల గురించి చర్చించుకుందామని.. కమ్యూనిస్టులు పవన్ కు లేఖ రాశారు. ఈ లేఖ విషయం మీడియాలో వచ్చేసరికి.. జనసేన కీలక నేతలు ఓ సమావేశం నిర్వహించి, త్వరలో చర్చలని ప్రకటించారు. త్వరలో అంటే ఎప్పుడు? అనేది వారు తెలియజేయలేదు. ఇలా అన్ని విషయాల్లోనూ వాయిదా పద్దతి వేయడం తగదని రాజకీయ విశ్లేషకులు పవన్ కు సూచిస్తున్నారు. అలాగే పవన్ ఎంత త్వరగా రోడ్ షోలు, బహింగ సభలు ఏర్పాటు చేస్తారా? అని జనం ఎదురు చూస్తున్నారని వారంటున్నారు.