వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయా? నల్లారి సోదరుల మధ్య పోటీ ఉంటుదా? మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయకపోయినా, కాంగ్రెస్ పార్టీ తరుపున బలమైన అభ్యర్థిని దించాలని భావిస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది. పీలేరు నియోజకవర్గంలో నల్లారి కుటుంబానికి పట్టుంది. గతంలో ఇక్కడి నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్, అభివృద్ధి పనులను ఆయన సోదరుడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి చూసుకునేవారు.అయితే కొన్నాళ్ల క్రితం నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అన్న కిరణ్ ఆశీస్సులతోనే ఆయన టీడీపీలో చేరారని, త్వరలోనే కిరణ‌్ కూడా పసుపు కండువా కప్పుకుంటారన్న ప్రచారం జరిగింది. అయితే అందుకు భిన్నంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జాతీయ రాజకీయాల వైపు వెళ్లాలన్న యోచనతో ఆయన కాంగ్రెస్ లో చేరిపోయారు. అయితే మాజీ ముఖ్యమంత్రిగా కిరణ్ వెంట నాయకులు పోలో మంటూ వచ్చేస్తారని అందరూ భావించారు. కానీ అది జరగలేదు.రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలను పక్కన పెడితే చిత్తూరు జిల్లా నుంచి కూడా నేతలెవ్వరూ కిరణ‌్ వెంట రాలేదు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని నెలరోజులు దాటిపోతున్నా కనీసం ఆయన కొన్ని దఫాలుగా ప్రాతినిధ్యం వహించిన పీలేరు నియోజకవర్గం నుంచి కూడా క్యాడర్ కిరణ్ వైపు చూడలేదు. దీనికి కారణం నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి అని కిరణ్ భావిస్తున్నారు. కిరణ‌్ ఫోన్లు చేసి ముఖ్యనేతలను పార్టీలోకి ఆహ్వానించినా వారు మాత్రం కిశోర్ తమపై వత్తిడి తెస్తున్నారని చెప్పడంతో కిరణ్ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.అంతేకాకుండా తాను ఎవరిమీదనైనా పోటీ చేస్తానని, చివరకు అన్న బరిలో ఉన్నా తన విజయం పీలేరు లో ఖాయమని నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కిరణ్ వర్గానికి చిర్రెత్తించాయి. కిరణ్ లేకుంటే కిశోర్ ఎక్కడ ఉండేవారని కిరణ్ అనుచరులు దుమ్మెత్తి పోస్తున్నారు. కిరణ‌్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిశోర్ నియోజకవర్గంలో చేసిన అవినీతి పనులను తాము బట్టబయలు చేస్తామంటున్నారు. అయితే ఇది టీ కప్పులో తుఫాను వంటిదేనని, కాంగ్రెస్, టీడీపీలు వచ్చే ఎన్నికల్లో అవగాహనతోనే వెళతాయని, కిశోర్ కు అన్న కిరణ్ అంటే గౌరవమని చెబుతున్నారు. పీలేరులో అన్నదమ్ముల వర్గాలు మాత్రం విభిన్నమైన ప్రకటనలు చేస్తూ క్యాడర్ ను అయోమయంలో పడేస్తున్నాయి.