ఖజానా లోటు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా పక్కా గృహాలకు నిధులు మంజూరు చేయలేని పరిస్థితి ఉంది. దాంతో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధులను జోడించింది. అయినా.. ఒక్కో ఇంటికి ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద రూ. 1.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వమైతే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఒక్కో ఇంటికి రూ. రెండు లక్షలు ఇస్తోంది. కేంద్రం కోటాలో ఇల్లు మంజూరైతే రూ. 50వేల అదనపు సాయం అందనుంది. అర్హులైన లబ్ధిదారులు పక్కాగృహం నిర్మాణానికి ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో పేరు నమోదు చేసుకోవడం మంచిదని అధికారులు భావిస్తున్నారు.2011లో కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వే ఆధారంగానే రాష్ట్రానికి ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయి. అప్పట్లో సర్వే బృందం వేసిన కాకిలెక్కల ప్రకారం జిల్లాలో 9,700 కుటుంబాలకు మాత్రమే ఇళ్లు లేవని తేల్చారు.సెప్టెంబరు నెలాఖరులోపు గృహ నిర్మాణశాఖ ఏఈలు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు ప్రతి ఇంటినీ సందర్శిస్తారు. ఇల్లు మంజూరుకు అర్హులైన వాస్తవ లబ్ధిదారుల వివరాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆవాస్ ప్లస్ యాప్‌లో నమోదు చేస్తారు. ఇప్పటికే అర్హులైన 40 వేల మంది వివరాలను పొందుపరిచారు. 2011, 2016లో నిర్వహించిన సర్వేలో నమోదైన అర్హులు ఇల్లు కట్టుకున్నారా..లేదా? స్థలం ఉందా..లేదా? ఇతర ప్రాంతాలకు వలసపోయారా? తదితర అంశాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఒకవేళ స్థలం ఉంటే సంబంధిత స్థలాన్ని ఫొటో తీసి అప్‌లోడ్ చేస్తున్నారు. ప్రధానంగా గుడిసెలు, రేకుల షెడ్లు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివాసం ఉంటున్న అర్హులతోపాటు అద్దె ఇంట్లో ఉన్నవారి వివరాలను నమోదు చేస్తున్నారు. ఆ లెక్కలను పరిగణనలోకి తీసుకుని గత రెండేళ్లుగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద జిల్లాకు 3,006 పక్కా గృహలు మంజూరు చేశారు. సర్వేలో జరిగిన లోపాల కారణంగా ఇళ్ల కేటాయింపు తగ్గింది. చాలా మంది అర్హులకు ఇల్లు మంజూరు కావడం లేదంటూ అన్ని రాష్ట్రాలు కేంద్రానికి నివేదించాయి. ఆ మేరకు తాజాగా సర్వే చేపట్టేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.2016లో జరిగిన ప్రజాసాధికార సర్వే ఆధారంగా జిల్లాలో 1.67 లక్షల మందికి పక్కాగృహాలు లేనట్లు గుర్తించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద సుమారు 45 వేల గృహాలను మంజూరు చేశారు. అవి పోను సుమారు మరో 1.25 లక్షల కుటుంబాలకు ఇళ్లు కావాల్సి ఉంటుందని గృహనిర్మాణశాఖ అధికారులు అంచనా వేశారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత... ‘మీకోసం’తోపాటు, ప్రజాప్రతినిధుల ద్వారా ఇల్లు మంజూరు కోరుతూ వచ్చిన అర్జీలనూ సర్వేలో చేరుస్తారు. తద్వారా వాస్తవిక లబ్ధిదారులు ఎందరో తేలనుంది. గృహ నిర్మాణశాఖ అధికారులు స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఆ రెండు అంశాల్లో కొంత సడలింపు ఇవ్వాలని నిర్ణయించారు. నూతన యాప్‌లో లబ్ధిదారుడి పేరుతోపాటు కులం, వయసు, వృత్తి, చదువు, కుటుంబ సభ్యుల సంఖ్య, ఆదాయం, ఆధార్ సంఖ్యలను నమోదు చేస్తారు. వీటితోపాటు లబ్ధిదారుడికి ఉన్న గృహోపకరణ వివరాలనూ సేకరిస్తున్నారు. ఫ్రిజ్, పొలం, ద్విచక్ర వాహనం, కారు, ప్రస్తుతం ఉంటున్న ఇంటి స్థితిగతులతోపాటు 13 అంశాలను పొందపరుస్తున్నారు. నివసిస్తున్న ఇంటితోపాటు, స్థలాన్ని ఫొటో తీసి అనుసంధానం చేస్తున్నారు.